Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో వెలుగులోకి మరో జాబ్ స్కామ్.. కాలేజ్ వైస్ ప్రిన్సిపల్‌తో పాటు 9 మంది అరెస్ట్

కర్ణాటకలో ఉద్యోగ నియామక పరీక్షలో జరిగిన మరో కుంభకోణం బయటపడింది. కర్ణాటక పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (కేపీటీసీఎల్‌)లో ఉద్యోగాల నియామక పరీక్షలో జరిగిన స్కామ్  వెలుగుచూసింది. 

KPTCL Question Paper Leak scam Police Arrest 9 accused
Author
First Published Aug 23, 2022, 10:53 AM IST

కర్ణాటకలో ఉద్యోగ నియామక పరీక్షలో జరిగిన మరో కుంభకోణం బయటపడింది. కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్‌ రాకెట్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నారు. అయితే తాజాగా కర్ణాటక పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (కేపీటీసీఎల్‌)లో ఉద్యోగాల నియామక పరీక్షలో జరిగిన స్కామ్  వెలుగుచూసింది. తొమ్మది మందిని అరెస్ట్ చేయడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. కేపీటీసీఎల్‌లో జూనియర్ అసిస్టెంట్ల భర్తీకి ఆగస్టు 7న రాష్ట్రవ్యాప్తంగా 21 కేంద్రాల్లో పరీక్ష జరిగింది.

అయితే కొందరు అభ్యర్థులకు హైటెక్ గాడ్జెట్‌లతో పరీక్షలు రాయడానికి సహకరించినందుకు గడగ్ మున్సిపల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మారుతీ సోనావానే, అతని కుమారుడు సమిత్‌కుమార్, పరీక్షా పర్యవేక్షకుడు అమరేశచంద్ర రాజూర్‌లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరంతా గడగ్-బెటగేరికి చెందినవారు. అలాగే  ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘మేము స్కామ్‌లో పాల్గొన్న 10 మంది అభ్యర్థులను కనుగొన్నాం. మిగిలిన వారిని త్వరలో అదుపులోకి తీసుకుంటాము’’ అని ఒక పోలీసు అధికారి చెప్పినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

ఆగస్ట్ 10న బెళగావి జిల్లా గోకాక్ తాలూకాలోని నాగనూర్‌కు చెందిన అభ్యర్థి తన స్మార్ట్‌వాచ్‌లో ప్రశ్నపత్రాన్ని చిత్రీకరిస్తున్నట్లు సీసీటీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దాని ఆధారంగా పోలీసులుఅరెస్టు‌లు చేశారు. విచారణలో అతను మొబైల్ అప్లికేషన్ ద్వారా బెళగావి జిల్లాలోని హుక్కేరి తాలూకాలోని శిరహట్టి గ్రామంలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న తన స్నేహితులకు చిత్రాలను పంపినట్లు తెలిసింది. సమాధానాలు రాయడానికి బ్లూటూత్‌ను ఉపయోగిస్తున్నట్లు అతను అంగీకరించిన తర్వాత.. పోలీసులు శిరహట్టి ఫామ్‌హౌస్‌పై దాడి చేసి ప్రశ్నపత్రాలు, యూపీఎస్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వారికి పంపబడిన ప్రశ్నపత్రం సీరియల్ నెంబర్ ఆధారంగా పోలీసులు గడగ్‌లోని కళాశాలతో సంబంధాన్ని కనుగొన్నారు.

అయితే పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌ కోసం కనీసం మూడు గ్రూపులు పనిచేస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. పరీక్ష రాసేందుకు స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలతో సహా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగించి సమాధానాలు అందించేందుకు అభ్యర్థుల నుంచి గ్రూపులు రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశాయి. త్వరగా సమాధానాలను కనుగొనడానికి, అభ్యర్థులకు కమ్యూనికేట్ చేయడానికి ప్రొఫెసర్లను నియమించుకున్నాయి. ఈ గ్రూపులు బెలగావి, గడగ్, ఉత్తర కన్నడ జిల్లాల్లో ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇక, ఇందుకు సంబంధించి తాము బెలగావికి చెందిన ఒక ప్రొఫెసర్‌ని గుర్తించామని, అతన్ని త్వరలో అతన్ని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమిత్‌కుమార్ జర్నలిస్టు వేషంలో గడగ్‌లోని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించి పరీక్ష పేపర్‌ను చిత్రీకరించిన తర్వాత లీక్ చేశాడని ఆరోపించారు. పరీక్ష సమయంలో పలు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన జామర్‌లు ఎందుకు పనిచేయడం లేదనే విషయంపై ఇంకా విచారణ జరగాల్సి ఉందన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios