కేరళలో 2002 నుంచి 2016 వరకు ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల సీరియల్ హత్యల వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం కోడలు జోలీయే సొంత కుటుంబసభ్యుల్ని హత్య చేస్తూ వచ్చినట్లు నిర్థారించారు.

వివరాల్లోకి వెళితే.. కోజికోడ్‌కు చెందిన రిటైర్డ్ టీచర్ అన్నమ్మ 2002లో కుప్పకూలినప్పుడు అందరూ ఇది సహజ మరణమని భావించారు. ఆరేళ్ల తర్వాత అదే ఇంట్లో అన్నమ్మ భర్త టామ్ థామస్ హార్ట్ ఎటాక్‌తో మరణించాడు.

2011లో వారి కుమారుడు జోలీ భర్త రాయ్ థామస్ సైతం హార్ట్ అటాక్‌తో కన్నుమూశాడు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో ఆయనపై విషప్రయోగం జరిగినట్లు తేలింది. ఆ తర్వాత 2014లో అన్నమ్మ సోదరుడు మ్యాథ్యూ మంజాదియల్ కూడా ఇదే తరహాలో మరణించడంతో అనుమానాలకు తావిచ్చింది.

2016లో అన్నమ్మ బంధువుల కుమార్తె రెండేళ్ల చిన్నారి  అల్ఫాన్సా  సైతం గుండెపోటుతో మరణించగా.. కొద్దినెలల్లోనే ఆమె తల్లి సిల్లీ మరణించింది. అయితే  ఈ హత్యల వెనుక వారి కోడలు, రాయ్ భార్య జోలీ హస్తం ఉన్నట్లు  తేలింది.

సిల్లీ భర్త షాజును పెళ్లాడిన జోలీ.. కుటుంబం ఆస్తిని తమ పేరున రాయాలని మావయ్య టామ్‌పై ఒత్తిడి తీసుకొచ్చి అనుకున్నది సాధించింది.

అయితే అమెరికాలో స్థిరపడిన టామ్ చిన్న కుమారుడు మోజో.. వదినకు ఆస్తి బదలాయింపుపై సవాల్ చేయడంతో పాటు తమ కుటుంబంలో జరుగుతున్న వరుస మరణాలపై క్రైం బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండో భర్త షాజుతో కలిసి సైనేడ్  ద్వారా జోలీ కుటుంబసభ్యులందరిని హతమార్చినట్లు  పోలీసులు ధ్రువీకరించారు.