వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి కేరళలోని కాలికట్ వస్తున్న ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వర్షం కురుస్తుండడంతో విమానం ల్యాండ్ చేసే సమయంలో జోరు వర్షం కురుస్తుండడంతో విమానం రన్ వే మీద నుండి స్కిడ్ అయి కింద పడి రెండు ముక్కలయింది. 

విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిరిండియా విమానం ప్రయాణికులను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగిందని డీజీసీఏ ప్రకటించింది.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరుకుంది. విమానంలో ఉన్న ప్రయాణీకులందరిని బయటకుతీసారు. మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లోని 13 ఆసుపత్రుల్లో క్షతగాత్రులందరికి చికిత్సను అందిస్తున్నారు. కేరళ సీఎం పునరాయి విజయన్ అర్థరాత్రి వేళ విమానాశ్రయాన్ని సందర్శించారు. బాధితులందరికీ చికిత్స అందించేలా చూడాలని ఆదేశించి ఎయిర్ పోర్టులో హెల్ప్ లైన్ నంబర్లన్నీ పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. 

మరో మంత్రి మొయిద్దీన్ అక్కడే విమానాశ్రయంలో ఉన్నారు. ఆయన దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా కు చెందిన రెండు బృందాలు నేడు విమానాశ్రయానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తారు. 

విమాన ప్రమాదం చోటు చేసుకోగానే స్థానికులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకొని క్షతగాత్రులను వారి సొంత వాహనాల్లో ఆసుపత్రులకు తరలించారు. పిల్లలను రక్షిస్తూనే వారికీ సంబంధించిన ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ వారిని గుర్తించారు. గంటల వ్యవధిలోనే వారికి సంబంధించిన వారు ఆయా ఆసుపత్రుల వద్దకు చేరుకున్నారు.