ప్రపంచ ప్రఖ్యాత రచయిత లియో టాల్‌స్టాయ్ రాసిన ‘వార్ అండ్ పీస్’ పుస్తకంపై బాంబే హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భీమా కోరేగావ్ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు న్యాయమూర్తి సారంగ్ కోత్వాల్ నిందితుడిని.. ‘‘ మీ ఇంట్లో వార్ అండ్ పీస్ పుస్తకం ఎందుకు వుందో వివరణ ఇవ్వండి’’ అని ఆదేశించారు.

దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ స్పందించారు. ‘‘ మహాత్మా గాంధీనే ప్రభావితం చేసిన టాల్‌స్టాయ్ రచించిన పుస్తకం ఇంట్లో ఎందుకు వుందని బాంబే హైకోర్టు జడ్జి ప్రశ్నించారు. నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం.. ఇదేనా కొత్త భారత్.. నవ భారతానికి స్వాగతం అంటూ రమేశ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో న్యాయమూర్తి సారంగ్ కోత్వాల్ స్పందించారు. ‘‘ వార్ అండ్ పీస్’’ క్లాసిక్ నవల అని తమకు తెలుసన్నారు.తాము ప్రశ్నించిన పుస్తకం లియో టాల్‌స్టాయ్ రాసింది కాదని.. ప్రముఖ సామాజిక కార్యకర్త విశ్వజిత్ రాయ్ సమకూర్చిన వ్యాసాల సంకలనమని చెప్పారు.