కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రాణానికి ప్రాణమైన భర్త దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలతో జీవిస్తోంది కోల్‌కతాకు చెందిన ఓ భార్య. భర్త అస్థికలను తన లాకెట్‌లో పెట్టుకుని.. వాటిలోనే ఆయనను చూసుకుంటోంది.
భారత్‌లో గతేడాది సంభవించిన కరోనా సెకండ్ వేవ్ దేశానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులు, భార్యా బిడ్డలు, స్నేహితులు, తోబుట్టువులు కళ్లెదుటే కన్నుమూస్తున్నా కాపాడుకోలేని నిస్సహాయత. కనీసం అంత్యక్రియల్ని స్వయంగా జరుపుకోలేని.. హాజరవ్వలేని దుస్థితి. వందల కోట్లు చెల్లిస్తామన్నా ఆసుపత్రిపై బెడ్ దొరకని దీనగాథలు ఎన్నో. పగవాడికి సైతం ఇలాంటి జీవితం వద్దు అనిపించేలా కరోనా భారతీయులను ఉక్కిరిబిక్కిరి చేసింది. కుటుంబానికి ఆసరా అయిన వ్యక్తులు దూరం కావడంతో కోట్లాది మంది రోడ్డున పడ్డారు. కోల్‌కతాకు చెందిన పాప్రీ చౌదరి, అరూప్ ప్రకాష్ చౌదరిల కథ కూడా ఇలాంటిదే.
కోవిడ్ బారినపడి ఇంటెన్సివ్ కేర్‌లో ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న తన భర్తను ఒకసారి చూపించమని పాప్రీ చౌదరి అక్కడి సిబ్బందిని అభ్యర్ధించారు. దీంతో నర్సులు ఆమెకు పీపీఈ కిట్ వేసుకోమని చెప్పి, వీల్ చైర్ లో ఐసీయూకి తీసుకుని వెళ్లారు. నేనిక ఊపిరి తీసుకోలేను అంటూ బ్రీతింగ్ మెషీన్‌పై అరూప్ ప్రకాష్ చౌదరి పాప్రీతో అన్నారు. ఆ తర్వాత నాలుగు రోజులకే ఆయన కన్నుమూశారు. అరూప్ మరణంతో పాప్రీ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. పాప్రీ చౌదరి జీవితంలో ఎన్నో అటుపోట్లను ఎదుర్కొన్నారు. 20 ఏళ్ల వయసులో ఆమె తండ్రి మరణించగా.. తల్లి అల్జీమర్స్ వ్యాధికి గురైంది. తర్వాత అన్నింట్లో తోడు నీడలా నిలిచిన భర్త అరూప్ కూడా కోవిడ్‌కు బలైపోయారు.
ఆయన మరణం తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణానికి అలవాటైన పాప్రీ చౌదరి.. తన భర్త అస్థికలను లాకెట్‌లో పెట్టుకుని ధరిస్తున్నారు. మానసిక శాస్త్రం చదవడానికి సాయంత్రం పూట క్లాసుల్లో చేరారు. తనలా మానసిక వేదనను అనుభవిస్తున్న వారికి పాప్రీ కౌన్సెలింగ్ చేస్తున్నారు. తన మూడు దశాబ్దాల వివాహ జీవితంతో పాటు కోవిడ్ మహమ్మారి ఎలా తన జీవితాన్ని తలకిందులు చేసిందన్న దానిపై స్వీయ చరిత్ర రాస్తున్నారు. కోవిడ్ వల్ల మరణించిన వారి కోసం ఒక స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు పాప్రీ చౌదరి యోచిస్తున్నారు.
దీనిలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక వర్చువల్ స్మారకం కోసం ఆమె తన భర్త జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. దీనిని కొంత మంది డాక్టర్లు, సామాజిక వేత్తలు కలిసి మొదలుపెట్టారు. మనదేశంలో ఈ తరహా స్మారకం ఇదొక్కటే. ఈ స్మారకం మొదలుపెట్టిన ఒక ఏడాదికి ఇందులో దాదాపు 300 మంది తమ వివరాలను పొందుపరిచారు. ఫిబ్రవరిలో ఈ స్మారక నిర్వాహకులు మనదేశంలో కోవిడ్ పరిహారం కోసం నమోదు చేసుకున్న వారి వివరాలను ఇవ్వాల్సిందిగా భారత్‌లోని 29 రాష్ట్రాలకు ఆర్ టి ఐ ద్వారా అభ్యర్థనలను చేశారు. అయితే, ఈ అభ్యర్ధనలకు కేవలం 11 రాష్ట్రాలు మాత్రమే స్పందించి 182 పేర్లను మాత్రమే ఇచ్చాయి. వైద్య వ్యవస్థ వైఫల్యం, ఆసుపత్రిలో బెడ్‌లు, ఔషధాలు, ఆక్సిజన్ కొరత లేకపోయి ఉండి ఉంటే ఎన్నో ప్రాణాలు పోయుండేవి కావని ఈ స్మారకం నిర్వాహకులు డాక్టర్ అభిజీత్ చౌదరి అన్నారు.
ఇక డాక్టర్ రజని జగ్‌తప్‌ది మరో కథ. 2020లో తన భర్త మరణం తర్వాత తన లాంటి బాధితుల కోసం ఒక సపోర్ట్ గ్రూపును ప్రారంభించారు. రజని జగ్‌తప్ భర్త శ్రీధర్ పుణె లో కోవిడ్ 19 బారిన పడి మరణించారు. ఈ దంపతులిద్దరూ డాక్టర్లు. ఈ నేఫథ్యంలో కోవిడ్‌లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు 'స్టేయింగ్ అలైవ్' అనే ఆన్ లైన్ సపోర్ట్ గ్రూపును ప్రారంభించారు రజని. ఈ గ్రూపులో ప్రస్తుతం 60 మంది సభ్యులున్నారు. అందులో ఒక థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఒక న్యాయవాది ఒక యోగ గురువు కూడా ఉన్నారు.
