Kolkata: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. హ్యాకర్లు పార్టీ అకౌంట్ పేరుతోపాటు, లోగోను కూడా మార్చేశారు. టీఎంసీ స్థానంలో యుగా ల్యాబ్స్ పేరు ప్రత్యక్షమైంది.
TMC Twitter account hacked: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్ గురైంది. హ్యాకర్లు పార్టీ అకౌంట్ పేరుతోపాటు, లోగోను కూడా మార్చేశారు. టీఎంసీ స్థానంలో యుగా ల్యాబ్స్ పేరు ప్రత్యక్షమైంది. దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు హ్యాకర్లు ఖాతా నుంచి ఎలాంటి పోస్టులు చేయలేదని సమాచారం.
తమ పార్టీ ట్విటర్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ వెల్లడించారు. ట్విట్టర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామనీ, సమస్యను వీలైనంత త్వరగా సరిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
కాగా, టీఎంసీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురికాగా, అందులో యుగ ల్యాబ్స్ పేరు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. యుగ ల్యాబ్స్ అనేది అమెరికాకు చెందిన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ కంపెనీ, ఇది ఎన్ఎఫ్టిలు, డిజిటల్ సేకరణలను అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా క్రిప్టోకరెన్సీ, డిజిటల్ మీడియాలో కూడా సంస్థ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అయితే, కొన్ని గంటల తర్వాత టీఎంసీ ట్విట్టర్ అకౌంట్ ను యథాతథస్థితి తీసుకువచ్చినట్టు ట్విట్టర్ వర్గాలు పేర్కొన్నాయి.
