Kolkata: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత సువేందు అధికారి హాజరైన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
3 Dead In Stampede At Charity Event: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు సువేందు అధికారి పాల్గొన్న దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ముగ్గరు ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మీడియా కథనాల ప్రకారం, సువేందు అధికారి ఈవెంట్ నుండి బయలుదేరిన తర్వాత తొక్కిసలాట ప్రారంభమైంది. “తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు" అని అసన్సోల్ దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ఓ మత సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందనీ, అందుకు తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అసన్‌సోల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ దుర్ఘటనపై స్పందించి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈ దుర్ఘటనకు బీజేపీ నేత సువేందు అధికారే కారణమని పేర్కొంది. ముగ్గురు మరణాలకు సువేందు అధికారి కారణమని టీఎంసీ ఆరోపించింది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ మంథాకు పూర్తి నష్టపరిహారం చెల్లించారని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ఆరోపించారు. ఈ నెల ప్రారంభంలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కంచుకోట అయిన డైమండ్ హార్బర్లో బీజేపీ ర్యాలీకి జస్టిస్ మంథా అనుమతించారు. దీనిని ఆయన తప్పుబట్టారు.
“ఇది చాలా దురదృష్టకర సంఘటన... ఈవెంట్ కోసం సువేందు అధికారి అనుమతి తీసుకోలేదు. దుప్పట్ల పంపిణీ పేరుతో, అధికారి పెద్ద సంఖ్యలో ప్రజలను ఒక ప్రదేశానికి పిలిపించారు. అంత పెద్ద జనసమూహానికి వసతి కల్పించే సామర్థ్యం లేదు…మొత్తం సమన్వయ లోపం. సువేందు అధికారి పేదల జీవితాలతో ఆడుకున్నారు. ఎలాంటి నైతిక బాధ్యత లేకుండా రాజకీయాలు చేస్తున్నాడు’’ అని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ చెప్పినట్టు ఇండియా టుడే నివేదించింది.
