కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో రెండు జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. కోల్ కతాలోని దక్షిణాది ప్రాంతంలో, నరేంద్రపూర్ లో ఈ జంట హత్యలు జరిగాయి. కోల్ కతాలోని నేతాజీ నగర్ లో వృద్ధ దంపతులు దిలీప్ ముఖర్జీ, సప్న ముఖర్జీని దుండగులు దారుణంగా హత్య చేశారు. 

నేతాజీనగర్ లోని రెండస్థుల భవనంలోని మొదటి అంతస్థులో దంపతుల శవాలు రక్తం మడుగులో పడి ఉన్నాయి. సప్న మృతదేహం మొదటి అంతస్థులోని ప్రవేశద్వారం వద్ద పడి ఉంది. ఆమె మెడను తాడుతో బంధించారు. గొంతులో పైప్ ను జొప్పించారు. ఆమె భర్త శవం గదిలోని పడకపై పడి ఉంది. 

ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు రాత్రిపూట ఇంటిలోకి ప్రవేశించి ఆ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఇళ్లంతా దోచుకున్నారు .సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. వారి హత్యకు కారణం పోస్టు మార్టం నివేదిక అందిన తర్వాత తెలుస్తుందని పోలీసులు అంటున్నారు .

మరో సంఘటన నరేంద్రపూర్ లో జరిగింది. ప్రదీప్ బిస్వాస్, అతని భార్య అల్పన శవాలు సూట్ కేసులో కుక్కి ఉన్నాయి. సూట్ కేసు ఇంటిలోని వాష్ రూంలో పడి ఉంది. ఆ ఇంటి కేర్ టేకర్స్ గా వారిద్దరు పనిచేస్తున్నారు .

ఇంటి యజమాని చాలా దూరంలో ఉన్నాడు. అతను కేర్ టేకర్ దంపతులతో మాట్లాడడాని ఫోన్ చేశాడు. దాంతో అతను ప్రదీప్ సోదరుడు జాయ్ కి ఫోన్ చేశాడు. జాయ్ వచ్చి చూడగానే శవాలు కనిపించాయి. దీంతో పోలీసులకు అతను సమాచారం ఇచ్చాడు.