ఓ మహిళా లాయర్ కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేసింది.  ఫోన్ ఛార్జర్ తో మెడకు ఉరివేసి మరీ హత్య చేసింది. అనంతరం తన భర్తది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం ఆమె చేయడం గమనార్హం. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కోల్ కతాకు చెందిన అనిందిత పాల్,  రజత్ భార్య భర్తలు. వీరికి మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. కాగా.. కొన్ని సంవత్సరాలుగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. అనిందిత.. తన భర్త మెడకు చార్జర్ ని గట్టిగా భిగించి హత్య చేసింది. అనంతరం తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. తాను పక్క గదిలో పడుకొని ఉన్నానని.. భర్త వేరే గదిలో ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించింది.

తొలుత అందరూ అతనిది ఆత్మహత్య అనే భావించారు. అనుమానం వచ్చి ప్రశ్నించడంతో.. హత్యగా నిర్థారణ అయ్యింది. కాగా.. అతనిది హత్య అని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యం లేకుండా ఆమె మాయం చేయడం గమనార్హం. ఆనిందిత వృత్తిరిత్యా ఓ లాయర్ కాగా.. రజత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటప 2018లో చోటుచేసుకోగా.. తాజాగా ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

భర్తను చంపిన కేసులో ఆమెను జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అదేవిధంగా ఆమెకు రూ. పదివేలు జరిమానా కూడా విధించారు. తమ కుమారుడిని కోడలు అనిందిత చంపేసిందంటూ రజత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్టు చేయగా.. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగుచూశాయి. అయితే.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనను కావాలని ఇరికిస్తున్నారని ఆమె ఆరోపించడం గమనార్హం. తన ఒంట్లో చివరి రక్తం బొట్టు ఉన్నంతవరకు పోరాడతానని.. తాను నిర్దోషినని నిరూపించుకుంటానని ఆమె చెప్పడం గమనార్హం.