ఓ యువకుడు కుళ్లిపోయిన తల్లి శవంతో.. రెండు వారాలకు పైగా ఇంట్లోనే గడిపాడు. ఈ సంఘటన కోల్ కత్తాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా.. అతనిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో నుంచి వస్తున్న దుర్వాసన భరించలేక ఇరుగుపొరుగు వారు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇంటి తలుపులు పగలకొట్టి చూడగా.. విషయం వెలుగులోకి వచ్చింది. 

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ భట్టాచార్య అనే వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసేవారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన చనిపోగా.. ఆ ఇంట్లో అతని భార్య, కుమారుడు నివసించేవారు. కుమారుడు మైత్రేయ నిరుద్యోగి. దీంతో.. తండ్రికి వచ్చే పెన్షన్ తోనే తల్లితో కలిసి జీవించేవాడు. ఇటీవల ఆమె జబ్బు పడి మరణించింది.

కాగా.. ఆమె మరణించి దాదాపు రెండు వారాలు గడుస్తున్నా.. అతను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడం గమనార్హం.  ఇంటి నుంచి దుర్వాసన భరించలేక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు  చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి.. మైత్రేయ తల్లి శవం పక్కనే కూర్చొని ఉన్నాడు. తన తల్లి శవాన్ని అదే ఇంట్లో పూడ్చిపెట్టాలని.. అది తన తల్లి చివరి కోరిక అని మైత్రేయ పోలీసులకు వివరించాడు.

తన తల్లి మరణించి కేవలం వారం రోజులే అయ్యిందని మైత్రేయ పోలీసులకు చెప్పాడు. కానీ.. మృతదేహం కుళ్లిపోయిన విధానాన్ని బట్టి.. రెండు వారాలు దాటి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మైత్రేయ మతిస్థిమితం సరిగాలేదని.. తరచూ ఇరుగుపొరుగు వారితో గొడవపడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. 

 అతను ఇంటి మెయిన్ డోర్ మీద తన వోటర్ ఐడెంటిటీ కార్డు, రేషన్ కార్డు, స్కూలు సర్టిఫికెట్లకు చెందిన జెరాక్స్ కాపీలు అతికించి ఉండడం పోలీసులను అయోమయానికి గురిచేస్తోంది. 

కాగా, కోల్‌కతాలో ఇటువంటి సంఘటనలు జరగడం ఇది మొదటిసారి కాదు. 2015లో దక్షిణ కోల్‌కతాలోని రాబిన్‌సన్ వీధిలో పార్థా డే అనే 44 ఏళ్ల వ్యక్తి తన సోదరి, పెంపుడు కుక్కల అస్థిపంజరాలతో దాదాపు ఆరు నెలలు తలుపులు వేసుకుని ఇంట్లోనే గడిపాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో శుభబ్రత మజుందార్ అనే 43 ఏళ్ల వ్యక్తి తన 84 ఏళ్ల తల్లి శవాన్ని మూడేళ్ల పాటు ఫ్రిజ్‌లో భద్రపరచినట్లు పోలీసులు కనుగొన్నారు.