పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని, ఆ విషయం తెలిస్తే తల్లిదండ్రులు తిడతారనే భయంతో ఓ బాలిక కిడ్నాప్ డ్రామా ఆడింది. ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలోని బన్స్‌ద్రోణి ప్రాంతంలో చోటుచేసుకుంది.
పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు తనని తిడతారని భయపడిన ఓ బాలిక కిడ్నాప్ డ్రామా ఆడింది. ఆమె తన ఆరేళ్ల చెల్లితో కలిసి ఇంటి నుండి కనిపించకుండా పోయింది. తరువాత ఓ కొత్త నంబర్ నుంచి తండ్రికి కాల్ చేసి కోటి రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే పోలీసులు వారిద్దరినీ సురక్షితంగా రక్షించారు. పోలీసులు ఆ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చివరకు బాలికను గుర్తించి కాపాడారు పోలీసులు. అయితే వారిని విచారణలో ఇదంతా ఓ డ్రామా అని తెలియడంతో ఒక్కసారిగా అవక్కయ్యారు.
వివరాల్లోకెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లో సెకండియర్ ఫలితాలు గత శుక్రవారం విడుదలయ్యాయి. అయితే దక్షిణ కోల్‌కతాలోని బన్స్‌ద్రోణి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికకు ఆ పరీక్షల్లో తన రిజల్ట్స్ చూసుకోవడానికి తన ఆరేళ్ల సోదరితో కలిసి సైబర్ కేఫ్‌కు వెళ్లింది. తన మార్క్‌షీట్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత కేవలం 31 శాతం మార్కులు రావడంతో కంగుతిన్నది. ఇంటికి వెళ్తే.. తన మార్కులు చూసి.. తల్లిదండ్రులు తిడతారనే భయంతో కిడ్నాప్ డ్రామా అల్లింది. ఇంటికి వెళ్లకుండా బయటనే తిరుగుతూ ఉంది. అయితే పిల్లలిద్దరూ చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాకపోయే సరికి..కంగారుపడిన తల్లిదండ్రులు చివరికి పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ అక్కాచెల్లిల్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి బాలికల కోసం వెతకడం ప్రారంభించారు. అనంతరం స్థానిక మెట్రో స్టేషన్ సమీపంలో బాలిక స్కూటీ కనిపించింది.
ఇంతలో గుర్తు తెలియని ఓ నెంబర్ నుంచి తల్లిదండ్రులకు SMS వచ్చింది. మీ పిల్లలిద్దరూ కిడ్నాప్‌కు గురయ్యారని, వారిని వెంటనే విడుదల చేయడానికి కోటి రూపాయలు అవసరమని SMSలో పేర్కొన్నారు. డబ్బుతో నేపాల్‌గంజ్ ప్రాంతానికి రావాలని కూడా ఎస్ఎంఎస్ లో సూచించారు. దీంతో పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేశారు. విచారణలో.. మైనర్ బాలిక, ఆమె సోదరి సీల్దా రైల్వే స్టేషన్ నుండి కృష్ణానగర్ లోకల్ రైలు ఎక్కి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), కృష్ణానగర్ జిల్లా పోలీసులు సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో నదియా జిల్లాలోని డివైన్ నర్సింగ్ హోమ్ ఎదుట ఇద్దరు బాలికలను గుర్తించారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసుల విచారణలో ఇదంతా ఓ డ్రామా అని తెలియడంతో ఒక్కసారిగా అవక్కయ్యారు. తమ తల్లిదండ్రులకు భయపడి తానే ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్టు ఆ బాలిక ఒప్పుకుంది.
