భార్య చనిపోతే... ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాల్సింది పోయి భద్రంగా ఇంట్లోనే దాచుకున్నారు. ఆమె మృతదేహం కుళ్లి బయటకు వాసన వస్తుంటే తట్టుకోలేని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.  ఈ సంఘటన కోల్ కత్తాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోల్ కతాలోని సర్సునా ప్రాంతానికి చెందిన రవీంద్రనాథ్ ఛటర్జీ కుటుంబం నివిస్తోంది. ఆయన భార్య ఛాయ ఛటర్జీ రెండు రోజుల క్రితం కన్నుమూసింది. అయితే... ఈ విషయాన్ని రవీంద్రనాథ్ కానీ.. ఆయన కుమార్తె గానీ బయటకు తెలియనివ్వలేదు. ఇంట్లోనే శవాన్ని పెట్టుకొని వారు  కూడా తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. అయితే... చనిపోయి రెండు రోజులు కావడంతో బయటకు శవం కుళ్లిన వాసన గుప్పుమని వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వారు వచ్చి ఇంట్లో తనిఖీ చేయగా... ఛాయ ఛటర్జీ శవం కనపడింది. దీనిపై రవీంద్రనాథ్ ఛటర్జీని ఆయన కుమార్తెను పోలీసులను నిలదీయగా.. వారు కనీసం నోరు కూడా విప్పకపోవడం గమనార్హం. పైగా.. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు తలుపులు, కిటికీలు మూసేశారని, చుటుపక్కలవారితో కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరించారని స్థానికులు తెలిపారు. కాగా..ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
అయితే స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆరు నెలల క్రితం రవీంద్రనాథ్ కుమారుడు దేబాశిష్(57) చనిపోయినప్పుడు కూడా ఆ కుటుంబం ఇలాగే ప్రవర్తించింది. కొడుకు మృతి చెంది రోజులు గడుస్తున్నా..మృత దేహాన్ని ఇంట్లోనే అట్టెపెట్టుకున్నారు. అంతిమసంస్కారం చేసేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఇంట్లో నుంచి తీవ్ర దుర్గంధం రావటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.కాగా..దేబాశిష్ మృత తరువాత ఆ కుటుంబం బయటి ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా తెంచుకుందని తెలస్తోంది. రోజు వారీ సరుకులు కొనటానికి కూడా వారు బయటకు వచ్చేవారు కాదని స్థానికులు తెలిపారు.