Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు: చిక్కుకొన్న పలు వాహనాలు, ఒకరి మృతి

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మరణించారు.  కొన్ని వాహనాలు కొండచరియల కింద చిక్కుకొనిపోయాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఐటీబీపీ  సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బుధవారం నాడు మధ్యాహ్నం 12: 45 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు చెబుతున్నారు.

Kinnaur landslide: ITBP personnel rush for rescue, several vehicles trapped
Author
New Delhi, First Published Aug 11, 2021, 3:28 PM IST

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నాడు కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మరణించారు. కొండచరియల కింద వాహనాలు చిక్కుకుపోయినట్టుగా అధికారులుతెలిపారు. కొండచరియలు విరిగి పడిన ఘటనలో సహాయక చర్యలకు ఐటీబీపీ పోలీసులు రంగంలోకి దిగారు.హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ ప్రాంతంలో బుధవారం నాడు మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకొంది.కిన్నౌర్‌లోని రెకాంగ్ పియో-సిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి.

 

 

 

కొండచరియల కింద రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బస్సు,  ట్రక్‌తో పాటు కొన్ని వాహనాలు చిక్కుకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వాహనాల్లో సుమారు 40 మంది ఉంటారని  డిప్యూటీ కమిషనర్ అబిద్ హుస్సేన్ సాదిక్ చెప్పారు.40 మంది ప్రయాణీకులతో వెళ్తున్న హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా బస్సుతో సహా అనేక వాహనాలు శిథిలాల కింద ఉన్నట్టుగా సాధిక్ చెప్పారు. రాష్ట్ర రోడ్డు రవాణా బస్సు కిన్నౌర్‌లోని రెకాంగ్ పియో నుండి సిమ్లా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు.హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో చిక్కుకొన్నవారిలో బస్సు డ్రైవర్, కండక్టర్ సహా నలుగురిని బయటకు తీసినట్టుగా  సీఎం జైరామ్ ఠాకూర్ చెప్పారు.

ఈ విషయం తెలుసుకొన్న వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు హిమాచల్ ప్రదేశ్ సీఎంతో మాట్లాడారు. కేంద్రం నుండి అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మూడు బెటాలియన్ల నుండి  200 మంది జవాన్లు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే చెప్పారు.సంఘటనస్థలంలో బండరాళ్లు ఉన్న కారణంగా సహాయక చర్యలు వేగంగా చేయడానికి ఆటంకం ఏర్పడుతోందని కిన్నౌర్ ఎమ్మెల్యే జేఎష్ నేగి చెప్పారు.గత మాసంలో ఇదే  కిన్నౌర్ జిల్లాలోని సాంగ్లా లోయలో కొండచరియలు విరిగిపడ్డాయి.  ఈ సమయంలో పర్యాటకుల వాహనంపై బండరాళ్లు పడడంతో 9 మంది పర్యాటకులు మరణించారు.
 


 

Follow Us:
Download App:
  • android
  • ios