సారాంశం
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై బ్రిటన్ రాజు చార్లెస్ III విచారం వ్యక్తం చేశారు. 43 ఏళ్ల క్రితం ఒడిశా పర్యటనను బ్రిటన్ రాజు చార్లెస్ గుర్తు చేసుకున్నారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కదిలించింది. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో మృతులు ఉండడంతో ప్రపంచ దేశాల నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘోర ప్రమాదంపై బ్రిటన్ రాజు చార్లెస్ III విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద బాధితులకు సంతాపం వ్యక్తం చేస్తూ.. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు ఓ సందేశాన్ని పంపించారు.
ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనను విడుదల చేసింది. బాలాసోర్ రైలు ప్రమాద వార్త తన్నెంతో కలిచివేసింది. నా భార్య క్వీన్ కెమిల్లా కూడా విచారం వ్యక్తం చేసిందని చార్లెస్ ఉటంకించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మా హృదయాలలో భారత్ కు , భారతీయులకు ప్రత్యేక స్థానం ఉంది. 1980లో ఒడిశాను సందర్శించి అక్కడి ప్రజలను కొందరిని కలిసిన జ్ఞాపకాలు ఇప్పటికీ నాలో ఉన్నాయి. అని బ్రిటన్ రాజు పేర్కొన్నారు. కింగ్ చార్లెస్ III సంతాప సందేశం రాజ కుటుంబానికి చెందిన అన్ని సోషల్ మీడియా ఖాతాలలో కూడా విడుదల చేయబడింది.
ఈ రైలు ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్, విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ కూడా స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొన్న వారిని అభినందించారు. మద్దతు, ప్రశంసలను తెలియజేశారు.
ట్రిపుల్ రైలు ప్రమాదంపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలోని ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా, నా దేశం తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సంతాపం వ్యక్తం చేశారు ఎర్డోగన్.
అంతకుముందు రోజు US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఫోన్ చేసి భయంకరమైన ట్రిపుల్ రైలు ప్రమాదంలో ప్రాణనష్టం గురించి విచారం వ్యక్తం చేశారు. బ్లింకెన్ ను విదేశాంగ మంత్రి అభినందించారు.జైశంకర్ ట్వీట్ చేస్తూ. "ఒడిశా రైలు ప్రమాదంపై మీ మద్దతు, సానుభూతిని తెలియజేయడానికి ఫోన్ కాల్ చేసినందుకు ఆంటోనీ బ్లింకెన్ కు ధన్యవాదాలు. అని పేర్కొన్నారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.