Asianet News TeluguAsianet News Telugu

హృదయవిదారక ఘటన .. భారీ చెట్టు కూల్చివేత‌.. వంద‌లాది పక్షుల మృత్యువాత‌ 

కేరళలోని మలప్పురంలో ఓ హృద‌య విదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా వందలాది పక్షులు మృతి చెందాయి. ఈ ఘటనలో కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అటవీశాఖ చర్యలు చేపట్టింది.

kills hundreds of birds in Malappuram in kerala
Author
First Published Sep 3, 2022, 5:01 PM IST

అభివృద్ధి పేరుతో  చెట్లుచేమ‌ల‌ను న‌రికి వేస్తున్నారు. ప‌శుప‌క్ష్యాదుల‌ ఆవాసాల‌ను నాశ‌నం చేస్తున్నారు. తాజాగా ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా వందలాది పక్షులు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరురంగడి ప్రాంతంలో జ‌రిగింది. మలప్పురంలో జాతీయ రహదారి-66 అభివృద్ధి ప‌నుల్లో భాగంగా  రోడ్డు ప‌క్క‌న ఉన్న భారీ చెట్లను నరికే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
మలప్పురంలో  రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల్లో భాగంగా  రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టును జేసీబీతో కూల్చివేశారు. అయితే ఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్లు కట్టుకుని.. గుడ్లు పెట్టి.. పిల్లలను పొదిగాయి. ఒక్క‌సారిగా చెట్టును కూల్చివేయడంతో వందలాది పక్షులు, వాటి పిల్లలు వాటి గూళ్లలో నుంచి  ఎగ‌ర‌లేక‌..నేలకు బలంగా తాకి చనిపోయాయి. కొన్ని పక్షులు ఎగిరి ప్రాణాలు దక్కించుకున్నాయి. ఆ చెట్టు మీదున్న పక్షుల గూళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఆ ప‌క్షులు ఎగ‌ర‌లేక బాధ‌తో త‌ల్లాడిల్లాడం.. చూసిన స్థానికుల హృద‌యం చ‌లించింది.
 
ఈ హృదయవిదారక వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ త‌న‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ ఘ‌ట‌న‌పై తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రతి జీవికి భూమి మీద‌ ఆవాసం కావాలన్నారు. ఈ వీడియో  సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్లు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పక్షులను కాపాడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించకుండా చెట్టును నరికివేశారు. ఈ విషయంపై వన్యప్రాణుల ప్రేమికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.  
 
ఈ సంఘటనపై  పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు కూడా తీవ్రంగా ఆహాగ్రం వ్య‌క్తం చేస్తున్నారు. పక్షులు గుడ్లు పెట్టి.. పిల్ల‌ల‌ను క‌నే స‌మ‌యం వ‌ర‌కు రోడ్డు విస్తరణ పనులను నిలిపివేయాలని కోరారు.

మరోవైపు.. ఈ ఘ‌ట‌న‌పై కేరళ అటవీ శాఖ కూడా స్పందించారు. ఆ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్ మాట్లాడుతూ.. ఈ ఘ‌ట‌న‌కు కార‌కులైన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఆ చెట్టును నరికివేయడానికి అటవీ శాఖ అనుమతి ఇవ్వలేదనీ, వారికి అనుమతి ఉన్నప్పటికీ.. చెట్ల‌పై పక్షులు నివసించినప్పుడు వాటిని నరికివేయకూడదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
 
అటవీ శాఖ అనుమతి లేకుండా చెట్టును నరికిన కాంట్రాక్టర్‌పై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. అలాగే చెట్టును తోసేందుకు ఉపయోగించిన జేసీబీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ నగర్ పంచాయతీ అధికారులు కూడా కాంట్రాక్టర్ త‌మ‌కు చెట్టు నరికివేత గురించి  సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ఆ హృద‌య విదార‌క ఘ‌ట‌న త‌మ‌ దృష్టికి రాగానే వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించామనీ, క్రూరమైన చర్యని వీకే పాడి వార్డు సభ్యురాలు లియాకతలి అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios