ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కలకలం సృష్టించిన ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ సంజీత్ యాదవ్ కిడ్నాప్, హత్య కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనలో ప్రమేయం వున్న నలుగురిని సస్పెండ్ చేసింది.

వీరిలో ఐపీఎస్ అధికారి అపర్ణా గుప్తా కూడా ఉన్నారు. కాన్పూరులో ల్యాబ్ టెక్నీషీయన్ గా  సంజీత్ యాదవ్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన ల్యాబ్ టెక్నీషీయన్ గా పనిచేస్తున్నాడు.

ఆసుపత్రిలో విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో జూన్ 22వ తేదీన ఆయన కిడ్నాప్ కు గురయ్యాడు. జూన్ 23వ తేదీన సంజీత్ యాదవ్ కన్పించకుండా పోయినట్టుగా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే అదే నెల 29వ తేదీన సంజీత్ కుటుంబసభ్యులకు కిడ్నాపర్ల నుండి ఫోన్ వచ్చింది. రూ. 30 లక్షలు ఇస్తే సంజీత్ ను విడిచిపెడతామని చెప్పారని వారు చెప్పారు. ఈ నెల 13వ తేదీన కిడ్నాపర్లకు పోలీసుల సమక్షంలోనే తాము డబ్బులు చెల్లించినా కూడ సంజీత్ ను వదిలిపెట్టలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. 

ఇదిలా ఉంటే కిడ్నాప్ కు గురైన యువకుడి సోదరి ఈ నెల  తాము కిడ్నాపర్లకు ఇచ్చిన బ్యాగులో డబ్బు లేదని చెప్పాలని తమపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు చేసింది. అంతేకాదు బంగారం, ఇళ్లు విక్రయించి ఈ డబ్బును సమకూర్చినట్టుగా ఆమె తెలిపారు. 

అయితే కిడ్నాపర్లకు బాధిత కుటుంబం రూ. 30 లక్షలు చెల్లించిందనే వాదనలను ఎస్పీ అపర్ణ గుప్తా ఖండించారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ కిడ్నాప్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ నెల 16వ తేదీన ఎస్‌హెచ్ఓను రంజిత్ రాయ్ ను సస్పెండ్ చేశారు. 

కిడ్నాపర్లు సంజీత్ యాదవ్ ను హత్య చేసి పండు నదిలో వేశారు. యాదవ్ ను గత నెల 26వ తేదీనే హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు. పండు నదిలో మృతదేహాన్ని వేశారు. నది నుండి డెడ్ బాడీని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కిడ్నాపర్లతో పోలీసులు  కుమ్మక్కయ్యారనే బాధిత కుటుంబం చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు.