Asianet News TeluguAsianet News Telugu

Kidnapped girl: విధి చాలా విచిత్రమైంది.. ఏడేండ్ల‌ వయసులో కిడ్నాప్.. 9 సంవత్సరాల తర్వాత దొరికిందిలా...

Kidnapped girl: తొమ్మిదేండ్ల‌ క్రితం కిడ్నాప్ కు గురైన బాలిక ఆచూకీని పోలీసులు గుర్తించారు. బాలికను సురక్షితంగా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబ‌యిలో జరిగింది.

 

 

Kidnapped girl in Mumbai reunited with family after 9 years  
Author
Hyderabad, First Published Aug 7, 2022, 4:36 PM IST

Kidnapped girl: ముంబ‌యిలో ఏడేండ్ల‌ బాలిక గ‌త‌ 9 సంవత్సరాల క్రితం అదృశ్యమైంది. ఆ బాలిక త‌న సోద‌రుడితో పాటు ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా..  పిల్ల‌లు లేని జంట బాలిక‌ను అప‌హ‌రించింది. మ‌రోవైపు..  కిడ్నాప్ అయిన విష‌యాన్ని తెలుసుకున్న త‌ల్లిదండ్రులు.. ఆ బాలిక గురించి.. ఊరంతా గాలించి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియ‌స్ గా తీసుకున్నారు. దాదాపు రెండేండ్ల పాటు తీవ్రంగా గాలించారు. ఎంత వెతికినా ఫ‌లితం లేకుండా పోయింది. కానీ ఓ ప‌నిమ‌నిషి స‌హాయంతో త‌న త‌ల్లిదండ్రుల‌కు ద‌గ్గ‌రైంది. 

పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలో నివసిస్తున్న డిసౌజా దంపతులు 2013 జనవరి 22న పూజా గౌర్ అనే ఏడేండ్ల బాలిక‌ను కిడ్నాప్ చేశారు. ఆ రోజు.. పూజ తన అన్నయ్యతో కలిసి బ‌డికి వెళ్లితుండ‌గా.. కిడ్నాప్ కు గురైంది. ఆ విష‌యం తెలియ‌క‌ త‌న అన్న‌య్య  కొంత సేపు అక్క‌డ‌ వెతికి  క‌నిపించ‌లేదు. త‌నకు చెప్ప‌కుండా.. స్కూల్‌కి వెళ్లి ఉండ‌వ‌చ్చ‌ని భావించి.. పాఠ‌శాల‌కు వెళ్లి  చెల్లెలి కోసం  వెతికాడు. అయితే.. ఆమె ఇంకా స్కూల్‌కి రాలేదని టీచర్ చెప్పింది. అనంతరం ఆ చిన్నారి అన్న‌య్య జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. పూజ కోసం ఇంటి స‌భ్యులంతా వెతికారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పూజ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్ర‌మంలో పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు. పాఠశాల యూనిఫాం ధరించిన పూజా ఫోటోల‌ను చుట్టు ఉన్న గ్రామాల్లో పంచారు. అయినా ఎలాంటి ఫ‌లితం కనిపించలేదు. ఆ సమయంలో పూజ 4వ తరగతి చదువుతోంది. ఆ సమయంలో DN నగర్ పోలీస్ స్టేషన్‌లోని అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర భోసలే (ప్రస్తుతం పదవీ విరమణ పొందారు) తప్పిపోయిన చిన్నారి ద‌ర్యాప్తును చాలా సీరియ‌స్ గా తీసుకున్నారు. తాను రిటైర్డ్ అయినా.. ఆ అమ్మాయిని వెతకడమే తన జీవిత లక్ష్యం చేసుకున్నాడు. కానీ పూజ దొరకలేదు. ఆయ‌న రిటైర్డ్ అయినా..  ఇప్పటికీ పూజా ఫోటోను జేబులో పెట్టుకుని ఆమె కోసం వెతుకుతుంటాడు. 

ఇదిలా ఉంటే.. కొన్నినెలల క్రితం డిసౌజా దంపతులు.. మ‌ళ్లీ ముంబాయిలోని అంధేరి ప్రాంతానికి మాకాం మార్చారు. సరిగ్గా అదే ప్రాంతంలో.. వారు కిడ్నాప్ చేసిన బాలిక పూజ ఫ్యామిలీ ఉండేది. ఆ బాలిక పెద్ద కావ‌డంతో ఎవ‌రూ గుర్తించ‌ర‌ని భావించారు. ఈ క్ర‌మంలో బాలికను ఎవ్వ‌రితో మాట్లాడ‌కుండా చూసేవారు.  ఆ దంపతులు ఆ బాలిక‌ను నానా ఇబ్బంది పెడుతూ.. ఇత‌ర ఇండ్ల‌లో చాకిరి చేయించేవారు. 

ఈ క్ర‌మంలో అదే ప్రాంతంలో ఇళ్లలో పనిచేసే 35 ఏళ్ల మహిళ ప్రమీలా దేవేంద్రతో ఆ బాలిక‌కు పరిచయం అయ్యింది.  ఆ బాలిక ప్ర‌తి విష‌యాన్ని ప్ర‌మీల‌తో షేర్ చేసుకునేది. ప్ర‌స్తుతం త‌న‌తో ఉంటున్న వారు అస‌లే త‌ల్లిదండ్రులు కాద‌నీ, తన అసలు తల్లిదండ్రులు వేరే వాళ్ల‌నని ప్రమీలకు బాలిక చెప్పింది. బాలిక చెప్పిన ఆధారంగా.. ప్ర‌మీల ఇంటర్నెట్‌లో బాలిక అదృశ్యంపై సెర్చ్‌చేసింది. ఈ క్ర‌మంలో వారు ఉంటున్న పాంత్రంలో పూజ అనే బాలిక గ‌త తొమ్మిది ఏండ్ల‌ క్రితం అదృశ్యమైన వార్తలను గుర్తించింది. త‌న‌తో పనులు చేస్తున్న బాలికే పూజ అనే అనుమానంతో ప్రమీల డీఎన్​ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది.
 
కిడ్నాప్ చేసిన దంప‌తుల‌ అరెస్టు  

పూజ గురించి వార్తలు వచ్చిన తర్వాత దర్యాప్తు చేశామని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ మిలింద్ ఖుర్దే తెలిపారు. ప్రమీల చెప్పిన అమ్మాయి 9 సంవత్సరాల క్రితం తప్పిపోయిన అమ్మాయి అని మేము కనుగొన్నామని తెలిపారు. దీంతో పోలీసులు హ్యారీ డిసౌజా, అతని భార్యను పట్టుకున్నాం. పూజ గత తొమ్మిదేళ్లుగా వారితో సహజీవనం చేస్తోంది. విచారణలో తాము పూజను కిడ్నాప్ చేశామని దంపతులు చెప్పారని మిలింద్ ఖుర్దే చెప్పారు. ఆ దంపతులకు పిల్లలు లేరు. కిడ్నాప్ తర్వాత బాలికను కొంతకాలం కర్ణాటకకు పంపించారు. ఆ తర్వాత తిరిగి ముంబైకి తీసుకొచ్చారు. డిసౌజా దంప‌తుల‌పై DN నగర్ పోలీసులు వివిధ సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు. డిసౌజాను గురువారం అర్థరాత్రి అరెస్టు చేసి ఆగస్టు 10 వరకు పోలీసు కస్టడీకి తరలించిన‌ట్టు అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios