తమిళ సినీ నటి ఖుష్బూ కొద్దిసేపటి క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆమె బీజేపీ గూటికి చేరారు.  కుష్బూకు పార్టీ అభ్య‌ర్థిత్వాన్ని సంబిత్ పాత్రా అందించారు. ఆమెకు కాషాయం కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. కాగా.. ఆమె ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఈ రోజు ఉదయమే ఆమె ఆ పార్టీకి రాజీనామా చేశారు.  కాంగ్రెస్ కి రాజీనామా చేసిన కొద్ది గంటలకే బీజేపీలో చేరడం గమనార్హం.

కాగా.. ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమెను ఇటీవల ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి తప్పించారు. ఈ క్రమంలోనే ఆమె  మనస్థాపానికి గురై పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న‌త స్థాయిలో ఉన్న కొంద‌రు .. గ్రౌండ్ రియాల్టీ తెలియ‌కుండానే ఆదేశాలు ఇస్తున్నార‌ని, ఇది న‌చ్చ‌క‌నే కాంగ్రెస్ పార్టీని వీడుతున్న‌ట్లు ఖుష్బూ ఇవాళ త‌న  రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు.  2014 నుంచి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.  రాబోయే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి ఖుష్బూ పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. త‌మిళ‌నాడులో బీజేపీ ముఖ‌చిత్రాన్ని ఖుష్బూ మార్చేస్తుంద‌ని కొంద‌రు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. 

గ‌తంలో ఆమె డీఎంకేలో కూడా చేరారు.  2010లో డీఎంకే అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఖుష్బూ ఆ పార్టీకి ప‌నిచేశారు.   ఆ త‌ర్వాత నాలుగేళ్ల‌కు ఆ పార్టీని వీడిన ఖుష్బూ.. సోనియా గాంధీతో భేటీ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది. కానీ 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వ‌లేదు.