ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఎదురైన గతినే తాను ఎదుర్కొంటానని ఖలిస్థాన్ సానుభూతిపరుడైన రాడికల్ గ్రూప్ 'వారిస్ పంజాబ్ కే' చీఫ్ అమృతపాల్ సింగ్  హోంమంత్రి అమిత్ షాను బెదిరించారు.

పంజాబ్ లో నేడు ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిస్ పంజాబ్ దే సంస్థ సభ్యుడిని అరెస్ట్ చేయడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఆ సంస్థ అధినేత, ఖలిస్తాన్ మద్దతుదారు అమృతపాల్.. ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే టార్గెట్ చేస్తూ.. బెదిరించారు. ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆపాలని ప్రయత్నిస్తే మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే.. హోంమంత్రి అమిత్ షాకు పడుతుందని 'వారిస్ పంజాబ్ దే'చీఫ్ అమృతపాల్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో బ్లూ స్టార్ లో భాగంగా అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లోకి సైన్యాన్ని పంపినందుకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీ గార్డ్సే హత్య చేసినట్టు, అమిత్ షాకు కూడా అదే గతి పడుతుందని అమృతపాల్ సింగ్ బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే దానికి కొనసాగింపుగా తాజా అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

'పంజాబ్‌లోని ప్రతి చిన్నారి ఖలిస్తాన్ గురించి మాట్లాడుతుంది'

అమృతపాల్ మాట్లాడుతూ.. “నేను హోంమంత్రిని ఏ విధంగానూ బెదిరించలేదు. ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వనని అమిత్ షా నన్ను బెదిరించారు. ఏజెన్సీలు నన్ను చంపాలనుకుంటున్నాయి. ఇందిర గాంధీ కూడా మమ్మల్ని అణిచివేసేందుకు ప్రయత్నించిందని, కానీ ఏమైందో తెలుసు అని అమృతపాల్ అన్నారు. ఇక అమిత్ షా కోరిక తీరుస్తాడో చూడాలి. పంజాబ్‌లోని ప్రతి పిల్లవాడు ఖలిస్తాన్ గురించి మాట్లాడతాడని అమిత్ షాకు చెప్పండి అని అమృతపాల్ అన్నారు.

ఇందిరాగాంధీ కూడా ఒత్తిడి చేస్తే ఫలితం ఏమైందో అందరికీ తెలిసిందే. అమిత్ షా తమ కోరికను తీర్చాలని అడుగుతున్నామని అన్నారు. ఇటీవల హోంమంత్రి అమిత్ షా ఖలిస్తాన్ మద్దతుదారులను తొలగించడం గురించి మాట్లాడటం గమనార్హం. పంజాబ్ ‌లోని ఖలిస్తాన్ మద్దతుదారులపై ప్రభుత్వం నిఘా ఉంచిందని ఆయన అన్నారు. ఇక దేశంలో ‘హిందూ రాష్ట్రం’ డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉద్యమంపై చేస్తున్న హెచ్చరికల్నే హిందూ రాష్ట్రం డిమాండ్ చేస్తున్న వారితో చేస్తే అమిత్ షా ఎంతకాలం హోంమంత్రిగా ఉంటారో చూస్తామంటూ అమృతపాల్ సింగ్ అన్నారు.

అమృత్‌సర్‌లో ఉద్రిక్తత

అదే సమయంలో.. కిడ్నాప్ కేసులో అరెస్టయిన అమృతపాల్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ తూఫానీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అమృత్‌పాల్ సింగ్, అతని మద్దతుదారులు అమృత్‌సర్‌లో పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఫిబ్రవరి 15న చమ్‌కౌర్ సాహిబ్‌కు చెందిన బరీందర్ సింగ్ అనే యువకుడిని కొందరు వ్యక్తులు అపహరించారు. సోషల్ మీడియాలో అమృతపాల్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారని ఆరోపించారు. బరీందర్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారని ఆరోపించారు. యువకుడి ఫిర్యాదు మేరకు అమృతపాల్, అతని సహచరుడు లవ్‌ప్రీత్ అలియాస్ తూఫానీ సహా 30 మంది మద్దతుదారులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తూఫానీని అరెస్ట్ చేశారు.

పోలీస్ స్టేషన్‌పై దాడి.. గాయపడ్డ పోలీసులు

తూఫానీ అరెస్టు తర్వాత అమృతపాల్ సింగ్ మద్దతుదారులు వేలాదిగా అజ్నాలా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. నానా బీభత్సం చేశారు. వారి దాడిలో ఆరుగురు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు నివేదించబడింది. ఈ సమయంలో అమృతపాల్ సింగ్ కూడా అక్కడే ఉన్నారు. అతని మద్దతుదారులు చేతిలో ఆయుధాలు, కత్తులతో గుమిగూడారు. ఈ సందర్భంగా పోలీసులపై రాళ్లు రువ్వారు. అమృతపాల్‌కు మద్దతుగా పెద్ద సంఖ్యలో నిహాంగ్‌లు కత్తులతో చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం కూడా జరిగింది.