ఫోన్ లో మిస్డ్ కాల్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. తర్వాత   ప్రేమ పేరిట వెంట పడ్డాడు. అతని ప్రేమ నిజమని నమ్మి... ఆమె కూడా ప్రేమించింది. కొన్నాళ్లు బాగానే ఉన్నాడు. తర్వాత మరో యువతి పరిచయం కావడంతో ఆమెతో పెళ్లికి సిద్ధపడ్డాడు.  ఇదేంటని ప్రశ్నించినందుకు ప్రియురాలిని దారుణంగా చంపేశాడు. ఆమె శవాన్ని తన పెరట్లోనే దాచిపెట్టడం విశేషం. ఎవరికీ అనుమానం రాకుండా.. అక్కడ శవం ఉందన్న విషయం తెలీకుండా వాసన రాకుండా ఉండేందుకు ఉప్పు చల్లాడు. కానీ... చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కేరళలో నెల రోజుల క్రితం రాఖీ అనే యువతి కనిపించకుండా పోయింది. కొచ్చికి చెందిన ఆ యువతి ఉద్యోగానికి అని చెప్పి జూన్ 21వ తేదీన బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా... వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రాఖీ కాల్ డేటా పరిశీలించగా.. ఆమె తరచూ అఖిల్ అనే యువకుడితో మాట్లాడినట్లు గుర్తించారు.

అఖిల్, రాఖీలకు రాంగ్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. దాదాపు ఆరు సంవత్సరాలుగా వారు ప్రేమించుకున్నారు. ఇటీవల అఖిల్ కి మరో యువతి పరిచయం ఏర్పడింది. ఆమెతో పెళ్లికి కూడా రెడీ అయ్యాడు. విషయం తెలిసి రాఖీ అతనిని నిలదీసింది. వెంటనే ఆమెకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లి అక్కడ హత్య చేశాడు. అనంతరం ఆమె శవాన్ని పెరట్లో పాతిపెట్టి వాసన రాకుండా ఉప్పు చల్లాడు.

తర్వాత పోలీసులకు దొరికిపోతానేమో అనే భయంతో.. శవాన్ని కాల్చివేశాడు. అయితే శవం పూర్తిగా కాలకపోవడంతో.. పోలీసులకు దొరికిపోయాడు. అఖిల్ ఇంట్లో సోదాలు చేసిన సమయంలో సగం కాలిన రాఖీ శవం దొరికింది. కాగా... నిందితుడిని అతనికి సహకరించిన అతని మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.