ఓ మహిళ పాము కాటుతో చనిపోయింది. ప్రమాదవశాత్తు పాము కరచి చనిపోయిందిలే అని అంతా అనుకున్నారు. అయితే.. అదే నెలలో ఆమెకు అంతకముందు కూడా పాము కరిచింది. ఒకే నెలలో రెండుసార్లు పాము కరవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీంతో.. ఆమె మృతిపై పలు అనుమానాలు మొదలయ్యాయి. సదరు మహిళ తల్లిదండ్రులు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేయగా... దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొల్లం జిల్లా అంచల్‌కు చెందిన సూరజ్ ఓ ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి. అతనికి ఉతారాతో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఏడాదిన్నర పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో గత కొద్ది రోజులుగా కలతలు మొదలయ్యాయి. సూరజ్‌ భార్యపై వరకట్న వేదింపులకు దిగాడు. ఉతారా కుటుంబం ఆర్థికంగా ఎటువంటి భరోసా ఇచ్చే దారి కపిపించకపోవడంతో తనను హత్యచేసి ఆ నేరాన్ని తనపైకి రాకుండా ఉండాలని ఆలోచించి ఓ పథకం వేశాడు. 

వెంటనే పథకాన్ని అమలు చేయాలని భావించి తనకు తెలిసిన సురేష్‌ అనే పాములు పట్టే వ్యక్తిని సంప్రదించి రెండు పాములను రూ. 10,000లకు కొన్నాడు. ఉతారా ఓ రోజు గదిలో నిద్రపోతుండగా పామును ఆమెపైకి వదిలగా అది కాటు వేసింది. ఆమె వెంటనే తేరుకొని చుట్టుప్రక్కల వారి సాయంతో ఆసుపత్రికి చేరుకొని ప్రాణాలతో బయటపడింది.

ఆ తర్వాత మరోసారి మే 7న సూరజ్‌ నిద్రపోతున్న ఉతారాపై మరోసారి పామును వదిలాడు. ఈసారి పాముకాటుకు ఉతారా ప్రాణాలు కోల్పోయింది. సూరజ్ మాత్రం‌ తనకేమీ ఎరగనట్లు పామును చంపి ఇంట్లోనే ఉంటున్నాడు.

తొలి హత్యయత్నం విఫలమవడంతో ప్రాణాలతో బయటపడిన ఆమె తన తల్లిగారి ఇంట్లో ఉంటూ కోలుకుంటోంది. ఆ సమయంలోనే భర్తపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే భార్యా తరఫు బంధువులపైనే అతడు నేరం మోపి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మరోసారి పాము కాటు వేయించి హత్య చేశాడు.

దీంతో పోలీసులు భర్తను అతడికి సహకరించిన వారిపైన హత్యనేరం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు భార్యను కట్నం కోసం తరచూ వేధించే వాడని మృతురాలి తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.