ఆ మిస్టరీ మహిళ ఎవరు: జాలీతో కలిసి ఫొటో, ఆ తర్వాత మాయం
ఆరుగురు కుటుంబ సభ్యులను హత్య చేసిన కేరళ సీరియల్ కిల్లర్ జాలీ జోసెఫ్ కోర్టులు నోరు విప్పలేదు. ఆమెతో పాటు ఓ మహిళ దిగిన ఫొటోపై పోలీసులు దృష్టి పెట్టారు. నిట్ కు సమీపంలోని టైలరింగ్ షాపులో పనిచేసే ఆ మహిళ కనిపించడం లేదు.
కొలికోడ్: కేరళలోని కొలికోడ్ కూడతాయిలో జరిగిన ఆరు హత్య కేసుల్లో ప్రధాన నిందితురాలు జాలీ జోసెఫ్ కు ఎవరెవరితో సంబంధాలున్నాయనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెతో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. జాలీ మొబైల్ ఫోన్ లోని ఫొటోల్లో ఉన్న ఓ మహిళపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఆ మహిళ ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
నిట్ కు సమీపంలోని ఓ టైలరింగ్ దుకాణంలో ఆమె పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆమె ఎవరనే విషయం తెలియడం లేదు. ఆమె ఆచూకీని కనిపెట్టే పనిలో పోలీసులు పడ్డారు. ఆ మహిళను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు
Also read: ఆరుగురిని చంపిన జాలీని కోర్టు వద్ద చూసేందుకు ఎగబడ్డ జనం...
ఆస్తి కోసం తన తొలి భర్త రాయ్ థామస్ తో పాటు మరో ఐదుగురు కుటుంబ సభ్యులను వరుసగా జాలీ హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరు హత్యలు గత 17 ఏళ్లలో జరిగాయి. జాలీ కాలికట్ నిట్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నట్లు నటించి, అందరినీ నమ్మించింది. దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.
నిట్ కు సమీపంలోనే టైలరింగ్ షాపులో పనిచేస్తున్న మహిళనే జాలీతో సన్నిహితంగా ఉంటూ ఫొటో కూడా దిగింది. దాంతో ఆమెను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెలికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఆ మహిళ వివరాలు చెప్పేందుకు జాలీ నిరాకరించారు. ప్రస్తుతం ఆ మహిళ టైలరింగ్ షాపులో పనిచేయడం లేదు. ఈ ఏడాది మార్చిలో జరిగిన నిట్ వార్షిక ఫెస్ట్ లో ఆ మహిళతో పాటు జాలీ నిట్ ఐడి కార్డు ధరించి పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలతో కూడా జాలీకి సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: జాలీకి ఆడపిల్లలంటే ద్వేషమా: కొద్దిలో మిస్సయిన ఇద్దరు చిన్నారులు...
ఇదిలావుంటే, తామరెస్సేరీ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జాలీతో పాటు అరెస్టయిన ఎం.ఎస్. మాథ్యూ, ప్రజి కుమార్ లను పోలీసులు హాజరు పరిచారు. పోలీసు కస్టడీలో ఏమైనా ఇబ్బంది ఎదుర్కుంటున్నారా అని న్యాయమూర్తి ఎం. అబ్దుల్ రహీం పలుమార్లు ప్రశ్నించారు. దానికి తల ఊపి లేదన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఏదైనా సమస్య ఉంటే చెప్పాలని న్యాయవాది కూడా అడిగాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. జాలీ పోలీసు కస్టడీని కోర్టు మరో రెండు రోజులు పొడగించింది.
Also Read: ఇప్పటికే ఆరు హత్యలు, మరోఇద్దరి హత్యకు ప్లాన్: జాలీ సైకోనా?...