దేశ విదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ కి కూడా పాకింది. చైనాలోని వుహాన్ లో మొదట మొదలైన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం దేశ విదేశాలకు పాకుతోంది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ కారణంగా 180మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ తమ దేశంలోకి అడుగుపెట్టకుండా ఉంటే బాగుండని చాలా మంది దేవుడిని ప్రార్థిస్తున్నారు. అలాంటి వైరస్ ఇప్పుడు భారత్ లో అడుగుపెట్టింది.

చైనాలోని వుహాన్ యూనివర్శిటీలో చదువుతున్న ఓ కేరళ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. చైనా నుంచి ఇటీవల ఆ విద్యార్థి భారత్ లో అడుగుపెట్టాడు.  ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ప్రస్తుతం ఆ విద్యార్థిని వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉందనే అనుమానంతో దాదాపు 400 మందిని ఇళ్లల్లోనే ఉంచారు. డాక్టర్ల పర్యవేక్షణలో వారంతా ఉన్నారు. ఇక ఢిల్లీ, ముంబయి నగరాల్లోని ఆసుపత్రుల్లోనూ ఐసోలేషన్ వార్డులో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

Also Read కరోనా రోగుల శాడిజం... మిగితా వాళ్లకి కూడా వైరస్ సోకాలని.....

2020 జనవరి 1 వరకు ఎవరెవరు చైనాలో పర్యటించి వచ్చారో వారందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. జలుబు, జ్వరం, శాసలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటే.. వెంటనే సమీపంలోని ఆసుపత్రుల్లో కరోనా వైరస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స చేయించుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. 

కాగా, దేశంలోని పలు విమానాశ్రయాల్లో ఇప్పటివరకు 30వేల మందికిపైగా ప్రయాణికులను స్క్రీనింగ్ చేశారు. ఇదిలా ఉండగా.. భారత్ లోకి కూడా కరోనా వైరస్ వ్యాపించింది అనే వార్తలు వినగానే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్ మరింత వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.