కేరళలో ఆకలితో ఉన్న ఏనుగుకు మందుగుందూతో నింపిన పైన్ ఆపిల్ (అనాస పండు) ను తినిపించి దాని మృతికి కారణమైన వారిని పట్టుకున్న వారికి తన సొంత డబ్బులోనుంచి రెండు లక్షలు నజరానాగా ఇస్తానని అన్నారు ఒక హైద్రాబాదీ. 

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కి చెందిన శ్రీనివాసన్ కేరళలో అలా ఏనుగు మరణించడం తెలుసుకొని తీవ్రంగా కలత చెందారు. ఆయన కలత చెంది అందరిలాగా కేవలం సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టి ఊరుకోలేదు. అలా ఆ ఏనుగును చంపిన వారిని పట్టుకుంటే రెండు లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. 

హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ కూడా ఇలా ఏనుగును గాయపరిచిన దుర్మార్గుల గురించిన సమాచారం ఇస్తే 50 వేల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించింది. ఈ ఘటన పట్ల యావత్ దేశం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

మానవత్వాన్ని మచ్చతెచ్చేలా కేరళ రాష్ట్రంలోని ప్రజలు ప్రవర్తించారు. గర్భంతో ఉన్న ఓ ఏనుగుకు పైనాపిల్ లో పేలుడు పదార్ధాలు పెట్టారు. ఆ పండును తినడంతోనే పేలుడు పదార్ధాలు ఏనుగు నోట్లో పేలాయి. గత నెల 27వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఆ ఏనుగు మృతి చెందింది.

కేరళ రాష్ట్రంలోని ఆడ ఏనుగుకు సైలెంట్ వ్యాలీ వద్ద పేలుడు పదార్ధాలు ఉన్న పైనాపిల్ ఇచ్చారు. ఇది తిన్న ఆ ఏనుగు గాయపడింది. ఆ గ్రామం వదిలి వెల్లియార్ నదిలోకి దిగింది. 

ఈ విషయం తెలిసిన అటవీ శాఖాధికారులు మరో రెండు ఏనుగులను రప్పించి నదిలో ఉన్న ఏనుగును బయటకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. కానీ గాయపడిన ఏనుగు మాత్రం బయటకు రాలేదు.

గత నెల 27వ తేదీన ఏనుగు మరణించింది. ఈ విషయాన్ని మల్లప్పురం అటవీశాఖ అధికారి సోషల్ మీడియాలో తెలిపారు.ఏనుగు గర్భంతో ఉందని ఆయన ప్రకటించారు.

సోషల్ మీడియా వేదికగా పలువురు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.నిందితులను తీవ్రంగా ఖండించారు.నోరు లేని వారి తరపున నిలబడి పోరాటం చేయాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. పురాణాల్లోనే రాక్షసులు ఉండేవారని విన్నాం.. కానీ మానవులు నిజమైన రాక్షసులు అంటూ మరికొందరు కూడ వ్యాఖ్యలు చేశారు.

పలువురు నెటిజన్లు ఏనుగు స్కెచ్ లు వేసి తమ మానవత్వాన్ని ప్రదర్శించారు. ఈ ఏనుగును చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.