Kerala model-actor Shahana: మోడల్, నటి అయిన ష‌హానా..  కోజికోడ్‌లోని ఆమె నివాసంలో శవమై కనిపించారు. ఆమె మ‌ర‌ణానికి కార‌ణం భ‌ర్త స‌జ్జాద్ అనే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో పోలీసులు అత‌న్ని అరెస్టు  చేశారు.  

Kerala Model Shahana died on her birthday: పుట్టినరోజునే అనుమాన‌స్ప‌ద స్థితిలో కేర‌ళ‌కు చెందిన ఓ ప్ర‌ముఖ మోడ‌ల్‌, న‌టి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మ‌ర‌ణానికి కార‌ణమ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న భ‌ర్తను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. కేరళకు చెందిన ప్రముఖ మోడల్‌, నటి షహానా అనుమానాస్పద స్థితిలో కన్నుమూసారు. గురువారం (మే 12) కాసర్‌ఘడ్‌లోని తన నివాసంలో ఆమె 21వ పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే, అనుమాన‌స్ప‌దంగా ఉరి వేసుకున్న స్థితిలో ప్రాణాలు కోల్పోయి క‌నిపించారు. పోలీసులు కేసు న‌మోదుచేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. 

మోడ‌ల్‌, నటి ష‌హానా మ‌ర‌ణంపై స్పందిస్తూ.. మృతురాలి భ‌ర్త‌పై ఆరోప‌ణ‌లు చేశారు. అర్థ‌రాత్రి ఒంటి గంట స‌మ‌యంలో షహానా చనిపోయిందంటూ తమ‌కు ఫోన్ వ‌చ్చింద‌ని కుటుంబీకులు తెలిపారు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన షహానా కుటుంబీకులు ఆమె చావుకు భర్త సజ్జద్‌ కారణమని ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసుల‌కు సైతం ఇదే విష‌యం గురించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సజ్జద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

న‌టి షహానా తల్లి మాట్లాడుతూ... "నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు. ఆమెను వేధించి చంపారు. అత్తారింట్లో తనను టార్చర్‌ పెడుతున్నారని చాలాసార్లు చెప్పింది. సజ్జద్‌ తాగొచ్చి నానా గొడవ చేసేవాడు" అని అన్నారు. అలాగే, అతడి తల్లిదండ్రులు, సోదరి కూడా షహానాకి నరకం చూపించేవార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే వేరు కాపురం పెట్టమని సూచించాను. ఇంటి నుంచి బయటకు వచ్చేసి అద్దెంట్లో ఉంటున్నారు. సజ్జద్‌ డబ్బు కోసం గొడవ చేస్తున్నాడని, దారుణంగా ప్రవర్తిస్తున్నాడని షహానా నాకు చెప్పింది. పుట్టినరోజున‌ మమ్మల్ని కలవాలనుకున్నా.. స‌జ్జాద్ ఒప్పుకోలేద‌నీ, ఆ రాత్రే ష‌హానా ఇలా ప్రాణాలు కోల్పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

కొజికోడాకు చెందిన సజ్జాద్‌ను ఏడాదిన్నర క్రితం షహానా వివాహం చేసుకుంది. సజ్జాద్ ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత షహానా తన మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించిందని, తాను తమిళంలో కూడా నటించేదని ఉవేమా తెలిపింది. షహానా చాలా డబ్బు సంపాదించడం ప్రారంభించిన తర్వాత ఖతార్‌కు తిరిగి రావడానికి సజ్జాద్ నిరాకరించాడని ఉవేమా పేర్కొంది. "ఆమె సంపాదించిన డబ్బులో అతను కూడా చాలా ఖర్చు చేసాడు" అని ఆమె తల్లి చెప్పింది. "మోడలింగ్‌కు సంబంధించి ఆమెకు వచ్చిన చెక్కు విషయంలో వారు గొడవ పడ్డారని మాకు సమాచారం అందింది. ఆమె కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అతని వెర్షన్. ఈ ఘ‌ట‌న‌పై అనేక అనుమానాలు వున్నాయి. దీనిపై దర్యాప్తు చేస్తున్నాము" అని ACP సుదర్శన్ మీడియాకు తెలిపారు.