కేరళ విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్ రాజీనామా వ్యవహారం ఆ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది. రాష్ట్ర లోకాయుక్త తనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు నివేదిక ఇవ్వడంతో జలీల్ తన పదవికి రాజీనామా చేశారు.

మంత్రి హోదాలో అధికారాన్ని దుర్వినియోగం చేశారని, కుటుంబ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించారంటూ లోకాయుక్త సీఎంకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో జలీల్ తన పదవికి రాజీనామా చేసి లేఖను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. సీఎంవో దానిని గవర్నర్ అరీఫ్ మహ్మద్ ఖాన్‌ ఆమోదానికి పంపించింది. అయితే ఇంకా జలీల్ రాజీనామాకు ఆమోద ముద్రపడలేదు. 

రాజీనామా అనంతరం జలీల్ తన ఫేస్‌బుక్‌లో ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరిపి ఏమీ కనుగొనలేకపోయాయని ఆయన చెప్పారు. కానీ మీడియా మాత్రం రెండేళ్లుగా తనను వెంటాడుతోందని ఆ పోస్టులో జలీల్ అసహనం వ్యక్తం చేశారు.

అయితే మీడియా సహా అన్ని దర్యాప్తు సంస్థలను తన ఇంటికి వెయ్యి సార్లు ఆహ్వానిస్తున్నట్టు మాజీ మంత్రి చెప్పారు. మీడియా సహా మితవాదులు కలిసి ఉన్న వామపక్ష వ్యతిరేక మహా కూటమి తనను చంపగలదేమో కానీ, ఎప్పటికీ ఓడించలేదని జలీల్ స్పష్టం చేశారు. మరోవైపు లోకాయుక్త ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ జలీల్ కేరళ హైకోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.