కేరళలో దారుణం జరిగింది. ఓ టీనేజ్ బాలికమీద గత మూడేళ్లుగా 44 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కేరళలోని మలప్పురంలో చోటుచేసుకుంది. నిర్భయ కేంద్రంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్న సమయంలో బాధితురాలు ఈ విషయాలను వెల్లడించింది. 

ఇప్పుడు 17యేళ్లున్న ఈ బాలిక మాట్లాడుతూ తనకు 13 యేళ్ల వయసున్నప్పటినుంచే లైంగికదాడికి గురవుతున్నానని, గత మూడేళ్లుగా బంధువులు కూడా తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారని తెలిపింది. 

13-14ఏళ్లు ఉన్నప్పుడు తాను పలుసార్లు లైంగిక వేధింపులకు గురయినట్లు, ఆ సమయంలోనే తనను చైల్డ్‌ హోంకు తరలించినట్లు పేర్కొంది. ఒక సంవత్సరం తర్వాత తన తల్లి వద్దకు వెళ్లడానికి అధికారులు అనుమతించగా, అక్కడ కూడా బంధువుల చేతిలో అత్యాచారానికి గురయినట్లు వివరించింది. 

దీంతో  ఆమె అక్కడి నుంచి పారిపోగా.. పాలక్కడ్‌లో అధికారులు గుర్తించి గతేడాది డిసెంబర్‌లో నిర్భయ కేంద్రానికి తరలించారు.  ఈ నేపథ్యంలో అక్కడ కౌన్సిలింగ్‌ సెషన్లలో బాలిక తన గోడును వెళ్లగక్కింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు 44మందిపై కేసు నమోదు చేయగా, వారిలో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేసినట్లు మలప్పురం ఎస్పీ మహ్మద్ హనీఫా పేర్కొన్నారు. 

2015 నుంచి బాలిక తన తల్లితో కలిసి మలప్పురంలోని ఓ చిన్న కాలనీలో నివసించేదని, తల్లి రోజూవారి కూలీ పనిలకు వెళ్తుండేది. దీంతో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలోనే పొరుగింటి వారు లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. నిందితులపై పోక్సో చట్టం కొంద కేసు నమోదు చేశామని, అతి త్వరలోనే మిగతా నిందితులను కూడా అరెస్ట్‌ చేస్తామని చెప్పారు.