ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎవరికీ ఇంట్లో నుంచి కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. నిత్యవసరాలకు మాత్రం బయటకు వస్తున్నారు. చాలా  మందికీ ఈ లాక్ డౌన్ లో తినడానికి తిండి కూడా సరిగా లభించడం లేదు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం లాక్ డౌన్ వేళ అదృష్టం తలుపుతట్టింది. ఇంటిముందుకు లక్ష్మీ దేవి వచ్చి ఆగింది. లాటరీ రూపంలో అతనికి రూ.41కోట్లు లభించాయి. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళలోని కన్నూర్‌కు చెందిన జిజేష్ కోర్త్ గత పదిహేనేళ్ళుగా రస్ అల్ ఖైమాలో నివసిస్తున్నాడు. అతనికి లాటరీ టిక్కట్లు కొనే అలవాటుంది. లాటరీలో కలిసి రాకపోయినా, వ్యాపారం దెబ్బ తిన్నా కూడా అతను తన అలవాటును మాత్రం మానుకోలేదు. అయితే కొద్ది రోజుల క్రితం... తన స్నేహితులలైన షన్నోజ్, షాజెహాన్‌లతో కలిసి లాటరీ టిక్కెట్ కొన్నాడు. ఆ తర్వాత దాని సంగతే మరచిపోయాడు.

ఒక రోజు హఠాత్తుగా ‘మీకు లాటరీ తగిలింది’ అంటూ లాటరీ సంస్థ నుంచి ఫోన్. నంబర్ సరిచూసుకున్న జిజేష్... తనకు రూ. 41.50 కోట్లు లాటరీ తగిలిందని నిర్ధారించుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అంతేకాదు... అబుదాబీలో లాటరీపై పన్ను కూడా లేదు. కాగా లాటరీలో వచ్చిన మొత్తాన్ని స్నేహితులతో కలిసి పంచుకుంటానని జిజేష్ వెల్లడించాడు.