ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో లాక్ డౌన్ విధించారు. అయితే.. ఈ లాక్ డౌన్ ఓ వ్యక్తి కొంప ముంచింది. పాపం స్నేహితుడు కదా.. లాక్ డౌన్ లో ఎలా ఇంటికి వెళతాడులే అని.. తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. 

అదే అతను చేసిన పెద్ద మిస్టేక్. ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడికి విధేయుడిగా ఉండాల్సిందిపోయి.. అతని భార్యపైనే కన్నేశాడు. సమయం చూసుకొని స్నేహితుడి భార్యతో సహా లేచిపోయాడు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇడుక్కీ జిల్లా మున్నార్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల లోథారియో అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.లాక్‌డౌన్ వల్ల లోథారియో మువత్తుపుజ పట్టణంలో  చిక్కుకుపోయాడు. 

మువత్తుపుజ పట్టణంలో తన చిన్ననాటి స్నేహితుడు భార్యా పిల్లలతో కలిసి ఉండటంతో అతని సహాయం కోరుతూ లోథారియో ఫోన్ చేశాడు. దీంతో తన చిన్ననాటి స్నేహితుడని లోథారియెను ఇంటికి తీసుకువచ్చి ఆశ్రయమిచ్చి భోజనం పెట్టాడు. 

అయితే.. లొథారియా అతని స్నేహితుని భార్యపై కన్నేశాడు. మెల్లగా మాటలు కలిపి తర్వాత తన మాయలోకి దింపేశాడు. ఒకరోజు స్నేహితుడికి తెలీకుండా అతని భార్యతో పరార్ అయ్యాడు. ఆమె ఇంట్లోని బంగారం, డబ్బు తీసుకొని భర్త తన కోసం కొన్న కారులోనే పారిపోవడం విశేషం.

కాగా.. తాను ఘోరంగా మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో పోలీసులు పారిపోయిన వివాహితను పట్టుకువచ్చారు. తన భర్త స్నేహితుడితోనే తాను ఉంటానని భార్య చెప్పడంతో భర్తతోపాటు పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. 

కాగా పారిపోయిన భార్యను భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వీరికి ఇద్దరు పిల్లలున్నారని పోలీసులు చెప్పారు. భర్త స్నేహితుడితో కలిసి పారిపోయిన భార్యపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు బెదిరించడంతో ఆమె తిరిగి భర్తతో ఉండేందుకు అంగీకరించింది. స్నేహితుడితో లేచిపోయిన భార్యతో కాపురం చేసేందుకు భర్త కూడా అంగీకరించాడు.