ఆమె నిండు గర్భిణీ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమె మొహంలో ఆనందం లేదు. ఎందుకంటే... బిడ్డ పుట్టేనాటికే.. ఆమె పుట్టెడు శోఖంలో ఉంది. సరిగ్గా బిడ్డ పుట్టడానికి ఒక్కరోజు ముందే ఆమె తన భర్తను కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన కేరళలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళకు చెందిన మెకానికల్ ఇంజినీర్ నితిన్ చంద్ర(29) దుబాయిలో స్థిరపడ్డాడు. భార్య అతిరా గీతా శ్రీధరన్ నిండు గర్భిణీ కాగా.. ఇటీవల ఆమెను 'వందే భారత్ మిషన్' ద్వారా మే 7న దుబాయ్ నుండి భార‌త్‌కు పంపించాడు. అతను మాత్రం ఉద్యోగ పనుల వల్ల అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో అధిక రక్తపోటుకు గురై చికిత్స పొందుతున్న నితిన్‌ సోమవారం తన అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నిద్రించాడు. గుండెపోటు రావడంతో నిద్రలోనే మరణించాడు. 

అతను మరణించిన మరుసుటి రోజే భార్య పండంటి ఆడపిల్లకు జన్మనించింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
కాగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక డెత్‌ నోటిఫికేషన్ పత్రం ప్రకారం నితిన్ గుండె ఆగిపోవడం వల్ల చ‌నిపోయాడ‌ని తేలింది. బుధవారం నితిన్ మృతదేహం స్వ‌స్థ‌ల‌మైన కోజికోడ్‌కు తీసుకు రానున్నారు.

ఇక‌ నితిన్ కేసును హ్యాండిల్ చేస్తున్న సీనియర్ లీగల్ కన్సల్టెంట్ అడ్వొకేట్ హశిక్ టీకే మాట్లాడుతూ... నితిన్ మృతదేహానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎంబామింగ్ ప్ర‌క్రియ జ‌రిగింద‌న్నారు. మిగతా లీగ‌ల్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి, వీలైనంత త్వ‌ర‌లో మృతదేహాన్ని స్వ‌దేశానికి పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ఆయ‌న‌ అన్నారు.