కరోనా లాక్ డౌన్.. తండ్రిని భుజాలపై మోస్తూ...
అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే..కనీసం ఓ వాహనం కూడా దొరకడం లేదు. ఒక వేళ ఎలాగోలా వాహనం సంపాదించినా.. పోలీసులు అనుమతించడం లేదు. దీంతో.. మరింత అవస్థలు పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి ఇలాంటి సంఘటనే ఎదురైంది. పోలీసులు అనుమతించకపోవడంతో ఎర్రటి ఎండలో తండ్రిని ఓ కొడుకు భుజాలపై మోస్తూ వెళ్లాడు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రళలోని కొల్లాం జిల్లా కులతుపుజాకు చెందిన ఓ వృద్దుడు(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పునలూరు తాలుకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జి చేశారు. దీంతో తండ్రిని ఇంటికి తీసుకొచ్చేందుకు అతని కమారుడు రోయ్ మన్.. తన తల్లితో కలిసి సొంత ఆటోలో ఆసుపత్రికి వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో ఓచోట పోలీసులు ఆటోను అడ్డుకున్నారు. డాక్యుమెంట్స్ లేవంటూ ఆటోని పోనివ్వలేదు.
పాపం.. పోలీసులను వాళ్లు చాలాసేపు బ్రతిమిలాడినా కనికరించలేదు. దీంతో.. రోయ్ మన్ తన తండ్రిని భుజాలపై వేసుకొని ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వెళ్లాడు. ఆ పక్కనే అతని తల్లి రెండు చేతుల్లో సంచులు మోస్తూ కనిపించింది.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. కాగా.. ఆ ఫోటోలో రోయ్ మన్ తండ్రి శరీరంపై షర్ట్ కూడా లేకపోవడం గమనార్హం. కాగా.. ఈ ఘటనను మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసుగా తీసుకుని విచారణకు ఆదేశించింది.