ఓ వ్యక్తి తన తోడుబుట్టిన చెల్లెలికి ఐస్ క్రీంలో విషం కలిపి మరీ దగ్గరుండి తినిపించి మరీ హత్య చేశాడు. కేవలం చెల్లికి మాత్రమే కాకుండా.. ఆ విషయం కలిపిన ఐస్ క్రీం.. తండ్రికి, తల్లికి కూడా పెట్టడం గమనార్హం. అయితే.. ఆ బాలిక చనిపోగా.. తల్లిదండ్రులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన ఓ యువకుడు(22) తల్లి, తండ్రి, చెల్లితో కలిసి జీవిస్తున్నాడు. అయితే.. ఆ యువకుడికి వారందరితో కలిసి బతకడం ఇష్టం లేదు. ఒంటరిగా జీవించాలని అనుకునేవాడు. అందుకు తల్లిదండ్రులు,చెల్లెలు అడ్డుగా భావించాడు. ఈ క్రమంలో వారందరినీ హత్య చేయాలని అనుకున్నాడు.

పథకం లో భాగంగా  ఐస్ క్రీం కొని దాంట్లో విషం కలిపాడు. అది తిన్న తర్వాత సదరు యువకుడి చెల్లి, తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రి కి తరలించగా.. బాలిక చనిపోయింది. యువకుడి తండ్రి మాత్రం చికిత్స తర్వాత కోలుకున్నారు. అయితే.. అదే ఐస్ క్రీం తిన్న వాళ్ల తల్లికి మాత్రం ఏమీ కాకపోవడం గమనార్హం. 

బాలిక మృతదేహానికి పోస్టు మార్టం చేసిన తర్వాత అది హత్య అని తేలింది. దీంతో.. అనుమానంతో యువకుడిని విచారించగా.. తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. తనకు ఒంటరిగా జీవించడం ఇష్టమని అందుకే ఇలా చేశానని చెప్పడం గమనార్హం.