న్యూఢిల్లీ: కేరళకు చెందిన జర్నలిస్ట్ సహా మరో ముగ్గురిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.

పీఎఫ్ఐకి సంబంధాలున్నట్టుగా ఆరోపణలు ఉన్న జర్నలిస్ట్ సహా మరో ముగ్గురిని మధుర పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.ఈ నలుగురు హత్రాస్ కు వెళ్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.  

అతిక్ ఉర్ రహమాన్, సిద్దికి కప్పన్, మసూద్ అహ్మద్, అలమ్ ల గురించి పోలీసులకు సమాచారం అందడంతో అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుండి హత్రాస్ కు అనుమానాస్పద వ్యక్తులు వెళ్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో వారిని పోలీసులు మధుర వద్ద అరెస్ట్ చేశారు.

ఈ నలుగురి నుండి స్వాధీనం చేసుకొన్న ల్యాప్ టాప్ లు, ఫోన్లు, సాహిత్యం శాంతిభద్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. దర్యాప్తులో  వీరికి సీఎఫ్ఐ తో సంబంధాలున్నట్టుగా ఒప్పుకొన్నారని పోలీసులు  ఓ ప్రకటనలో తెలిపారు.

హత్రాస్ లో 19 ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత వారంలో మరణించింది. అయితే ఈ బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కలకలం రేపింది.

సిద్దిఖీ కప్పన్ కేరళ రాష్ట్రంలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు. హత్రాస్ లో చోటు చేసుకొన్న పరిణామాలను కవర్ చేసేందుకు సిద్దిఖీ వెళ్లాడని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఢిల్లీ జర్నలిస్ట్ కమిటీకి ఆయన కార్యదర్శిగా కూడ పనిచేస్తున్నారు.అరెస్టు చేసిన జర్నలిస్ట్ కప్పన్ ను వెంటనే విడుదల చేయాలని జర్నలిస్ట్ సంఘాలు కోరాయి. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశాయి.

యూపీ పోలీసులు హత్రాస్ టోల్ ప్లాజ్ వద్ద ఆయనను అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందిందని  ఆ లేఖలో పేర్కొన్నారు. అతడిని సంప్రదించేందుకు న్యాయవాదులు సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదని యూనియన్ నేతలు చెప్పారు. సిద్దిఖీని అరెస్ట్ చేసినట్టుగా యూపీ పోలీసులు ప్రకటించలేదు.

కప్పన్ కు గతంలో పీఎఫ్ఐతో సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. అయితే ఈ ఆరోపణలు చేసినవారిపై ఆయన లీగల్ నోటీసులు పంపాడు.

కప్పన్ పనిచేసే వెబ్ సైట్ ఎడిటర్ కెఎణ్ ఆశోకన్ ... కూడ ఈ విషయమై స్పందించాడు. తమ సైట్ కు కప్పన్ కంట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాడని చెప్పారు. పీఎఫ్ఐతో కప్పన్ కు ఎలాంటి సంబంధాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. హత్రాస్ కు వెళ్తున్నట్టుగా సోమవారం నాడు ఆయన తనకు సమాచారం ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. 

గత ఏడాది పీఎఫ్ఐ పై యూపీ ప్రభుత్వం నిషేధం విధించింది. సిటిజన్ షిప్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగిన తర్వాత ఈ సంస్థపై బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.