Coronavirus: కేర‌ళ‌లో క‌రోనా ఉధృతి.. క‌ఠిన‌ ఆంక్ష‌లు.. విద్యాసంస్థ‌లు 2వారాలు మూత !

Coronavirus: కేర‌ళ‌లో క‌రోనా పంజా విసురుతోంది. నిత్యం 40 వేల మందికి పైగా కోవిడ్-19 మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రిన్ని క‌ఠిన ఆంక్షలు విధించింది. జిల్లా స్థాయిలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధ‌మవుతోంది. 
 

Kerala imposes more restrictions amid rising Covid-19 cases, check new guidelines here

Omicron sub-variant: క‌రోనా మ‌హ‌మ్మారి అనేక మ్యూటేష‌న్ల‌కు గురై మాన‌వాళికి మ‌నుగ‌డ‌కు స‌వాలు విసురుతోంది. ప్ర‌స్తుతం చాలా దేశాల్లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దీంతో Coronavirus రోజువారీ కేసుల్లో కొత్త రికార్డు న‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సైతం క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్ల‌ను తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని హెచ్చిరిస్తున్న‌ది. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లోదారుణంగా మారిన ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని ముంద‌స్తు చర్య‌లు తీసుకోవాల‌ని సూచిస్తోంది. ఇక భార‌త్ లోనూ క‌రోనా కేసులు నిత్యం ల‌క్ష‌ల్లో న‌మోద‌వుతున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో అయితే, క‌రోనా క‌ల్లోలం రేపుతున్న‌ది. అలాంటి రాష్ట్రాల్లో కేర‌ళ ఒక‌టి. కేర‌ళ‌లో నిత్యం 40 వేల‌కు పైగా కొత్త కోవిడ్‌-19 కేసులు న‌మోద‌వుతున్నాయి. 

ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ నేతృత్వంలోని కేర‌ళ స‌ర్కారు రాష్ట్రంలో మ‌రిన్ని క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తోంది. స్థానిక ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే విష‌యంపైనా కూడా జిల్లా యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు బాగా పెరుగుతుండటంతో, వరుసగా మూడు రోజుల పాటు 40 శాతం కంటే తక్కువ హాజరు ఉన్న విద్యా సంస్థలను రెండు వారాల పాటు మూసివేయాల‌ని కేర‌ళ స‌ర్కారు ఆదేశాలు జారీ చేసింది. 40 శాతం కంటే తక్కువ హాజరు ఉన్న విద్యాసంస్థలను క్లస్టర్లుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన కోవిడ్-19 స‌మీక్ష సమావేశం త‌ర్వాత నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా కేసులు, ఆస్ప‌త్రుల్లో చేరిక‌ల ఆధారంగా జిల్లాల వర్గీకరణ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. రాష్ట్రలో క‌రోనా వ్యాప్తి అధికంగా ఉంద‌నీ, ఆస్పత్రుల్లో చేరిక‌లు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 

కోవిడ్‌-19 కేసులు, ఆస్పత్రుల్లో చేరిక‌ల ఆధారంగా జిల్లా స్థాయిలో ఆంక్ష‌లు విధించ‌డంతో పాటు ఆయా జిల్లాల‌ను ఏ,బీ,సీ అనే మూడు గ్రూపులుగా విభ‌జించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి అధికారం ఇచ్చింది స‌ర్కారు. A కేటగిరీ కిందకు వచ్చే జిల్లాల్లో, అన్ని సామాజిక, సాంస్కృతిక, మత, రాజకీయ, బహిరంగ కార్యక్రమాలు, వివాహాలు, అంత్యక్రియలకు 50 మంది వరకు మాత్ర‌మే హాజ‌రు ప‌రిమితి విధించారు.  బీ, సీ, కేటగిరీ జిల్లాల్లో అలాంటి సమావేశాలు అనుమతించబడవు. ఈ ప్రాంతాల్లో అన్ని స‌మావేశాలు అన్‌లైన్ లోనే నిర్వ‌హించాల‌ని తెలిపింది. అయితే, వివాహాలు, అంత్యక్రియలకు గరిష్టంగా 20 మందిని అనుమతిస్తారు.  సీ కేటగిరీ జిల్లాల్లో సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు స‌హా ఇత‌ర కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌బ‌డ‌వు.

అత్య‌ధిక ఆంక్ష‌లు ఉన్న సీ కేట‌గిరీలో కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురం ఉంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. దీంతో అక్క‌డ మ‌రిన్ని క‌ఠిన ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు మూసివేశారు. అన్ని తరగతులు (ట్యూషన్ సెంటర్‌లతో సహా) వారికి అన్‌లైన్ త‌ర‌గ‌తులు కొన‌సాగించాల‌ని సూచించింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండ‌టంపై అప్ర‌మ‌త్త‌మైన స‌ర్కారు.. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది. రాష్ట్రంలోని 83 శాతం మంది ప్రజలు రెండు డోసుల వాక్సిన్లు తీసుకున్నార‌నీ, అలాగే, టీనేజీ పిల్ల‌లు సైతం  66 శాతం మంది టీకాలు తీసుకున్నార‌ని ప్ర‌భుత్వం తెలిపింది. కాగా, రాష్ట్రంలో ఇప్ప‌ట‌వ‌ర‌కు 56,46,665 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios