సహజీవనంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సంబంధాన్ని వివాహంగా గుర్తించలేమని స్పష్టం చేసింది. సహజీవనాన్ని వివాహంగా గుర్తించే చట్టమేమీ చేయలేదని, రెండు పార్టీలు ఒక ఒప్పందం ఆధారంగా  కలిసి జీవిస్తే.. అది వివాహచట్టం పరిధిలోకి రాదని కోర్టు పేర్కొంది.

సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్షిప్‌)పై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి సంబంధాలను వివాహాలుగా గుర్తించలేమని హైకోర్టు పేర్కొంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను మ్యారేజ్ గా గుర్తించే చట్టం ఏదీ చేయలేదనీ, కేవలం పరస్పర ఒప్పందం ఆధారంగా ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తే వివాహ చట్టం పరిధిలోకి రారనీ, ఆ బంధం వివాహ బంధమని అర్థం కాదని కోర్టు పేర్కొంది. అలాంటి జంటలు సహజీవనం చేయడం పెళ్లితో సమానం కాదని, అందులో విడాకులు కోరలేమని జస్టిస్ ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సోఫీ థామస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.

వివాహం అనేది సామాజిక, నైతిక ఆదర్శాలను ప్రతిబింబిస్తుందని, ఇక్కడ కూడా వీటిని అనుసరిస్తారని బెంచ్ పేర్కొంది.ఇది చట్టంలో కూడా అవి ధృవీకరించబడ్డాయనీ, గుర్తించబడ్డాయని తెలిపింది. ప్రస్తుతం చట్టబద్ధంగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కు వివాహ హోదా ఇవ్వబడలేదు. వ్యక్తిగత చట్టం ప్రకారం లేదా వివాహ చట్టం వంటి లౌకిక చట్టం ప్రకారం వివాహం జరిగినప్పుడు మాత్రమే చట్టం వివాహాన్ని గుర్తించబడుతోందని తెలిపింది. 

లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవిస్తున్న ఓ జంట పిటిషన్ పై కేరళ హైకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. పిటిషనర్ జంటలో ఒకరు హిందువు కాగా మరొకరు క్రిస్టియన్. ఒప్పందం మేరకు 2006లో భార్యాభర్తలుగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. రిలేషన్‌షిప్‌లో కలిసి జీవిస్తున్నప్పుడు.. వారిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉంది. ఇప్పుడు ఇద్దరూ తమ బంధాన్ని ముగించాలనుకుంటున్నారు.

ఈ విషయమై ఇద్దరూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ వారికి ఎదురుదెబ్బ తగలింది. వీరికి విడాకులు ఇచ్చేందుకు ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. వారు ఏ చట్టం ప్రకారం వివాహం చేసుకోలేదని కోర్టు వాదించింది. అటువంటి పరిస్థితిలో వారు విడాకులు కోరలేరు. దీంతో వారిద్దరూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. విడాకులు కేవలం చట్టబద్ధమైన వివాహాన్ని విచ్ఛిన్నం చేసే మార్గమని పేర్కొంది. లైవ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవించే వారికి అలాంటి గుర్తింపు ఉండదని పేర్కొంది.