తిరువనంతపురం: స్త్రీపురుషల మధ్య శృంగారం విషయంలో కేరల హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పురుషుడికి మహిళ లొంగిపోయినంత మాత్రాన శృంగారానికి అంగీరించినట్లు కాదని వ్యాఖ్యానించింది. శారీరక సంబంధానికి స్త్రీ ఆహ్వానిస్తేనే ఆమె హక్కులకు భంగం కలగలేదని భావించాల్సి ఉంటుందని చెప్పింది. 

ఆ రకంగా హైకోర్టు అత్యాచారానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. 2009 నాటి అత్యాచార కేసుకు సంబంధించి నిందితుడు చేసిన అప్పీలుపై తీర్పును వెలువరిస్తూ హైకోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో ఎనిమిదవ తరగతి చదివే ఓ బాలిక టీవీ చూసేందుకు నిందితుడి ఇంటికి వెళ్లేది. ఆ క్రమంలో నిందితుడు ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. దానివల్ల ఆమె గర్భం దాల్చింది. 

ఈ కేసులో అతన్ని అత్యాచారం చేసిన దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు తీర్పు చెప్పింది. దాన్ని నిందితుడు హైకోర్టులో సవాల్ చేశాడు. బాలిక తన కోసం పలుమార్లు వచ్చి వెళ్లేదని వాదించే ప్రయత్నం చేశాడు. ఆ రకంగా ఆమె తనకు దగ్గరయ్యేందుకు అంగీకరించినట్లేనని వాదించడానికి ప్రయత్నించాడు. 

అయితే, అతని వాదనలను కోర్టు అంగీకరించలేదు. మైనర్ బాలిక ఇచ్చిన అంగీకారాన్ని పరస్పర అంగీకారంతో కూడిన కలయికగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అలా చెబుతూ కింది కోర్టు తీర్పును సమర్థించింది. లొంగిపోయినంత మాత్రాన శారీరక సంబంధానికి అంగీకరించినట్లు కాదని తేల్చి చెప్పింది.