కేరళ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ (కేయూఎఫ్‌వోఎస్) వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ కె రిజి జాన్ నియామకాన్ని రద్దు చేసింది.

కేరళ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ (కేయూఎఫ్‌వోఎస్) వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ కె రిజి జాన్ నియామకాన్ని రద్దు చేసింది. సెలక్షన్ కమిటీ రాజ్యాంగం, కమిటీ సిఫార్సు చట్టవిరుద్ధమని గుర్తించిన హైకోర్టు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ మణికుమార్‌, జస్టిస్‌ షాజీ పి చలితో కూడిన ధర్మాసనం.. ఈ నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్‌ను అనుమతిస్తూ.. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా కొత్త వైస్ ఛాన్సలర్‌ను నియమించేందుకు కొత్తగా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ ఛాన్సలర్‌ను కోర్టు ఆదేశించింది.

కొత్త సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఛాన్సలర్‌ను ఆదేశించిన హైకోర్టు.. వైఎస్ ఛాన్సలర్ నియామకం తప్పనిసరిగా యూజీసీ నిబంధనలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే ఈ ఉత్తర్వులపై స్టే విధించాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది.

ఇక, గతేడాది డిసెంబర్‌లో జాన్ కొత్త వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. అయితే జాన్ నియామకాన్ని సవాలు చేస్తూ కొచ్చికి చెందిన కేకే విజయన్ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘వైస్ ఛాన్సలర్‌గా రిజి జాన్ నియామకం 2018 యూజీసీ నిబంధనలకు అనుగుణంగా లేదు. నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ఏకగ్రీవంగా ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను ఛాన్సలర్‌కు సమర్పించాలి. అయితే సెలక్షన్ కమిటీ ఈ పదవికి నియామకం కోసం జాన్ పేరును మాత్రమే సిఫార్సు చేసింది. అనంతరం ఆయన నియామకాన్ని ఛాన్సలర్ నోటిఫై చేశారు. అకడమిక్ ఎక్సలెన్స్ రంగంలో మిస్టర్ జాన్‌కు ఉన్న అనుభవాన్ని సెలక్షన్ కమిటీ ప్రస్తావించలేదు. అతని అర్హతలను నిర్ధారించకుండానే సెలక్షన్ కమిటీ అతని నియామకాన్ని సిఫారసు చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారం వైస్ ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా 10 సంవత్సరాల అనుభవం ఉండాలి లేదా పరిశోధన, అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్‌లో పదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.. కానీ ఆయనకు ఈ రెండు అర్హతలు లేవు’’ అని విజయన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియమాకాలు చట్టవిరుద్దమని ఆరోపిస్తూ.. వారిని రాజీనామా చేయాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గత నెలలో కోరిన సంగి తెలిసిందే. అలా గవర్నర్ కోరినవారిలో డాక్టర్ కె రిజి జాన్ కూడా ఉన్నారు. యూజీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీ నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ప్రస్తావించారు. అయితే దీనికి వ్యతిరేకంగా వీసీలు.. గవర్నర్ నోటీసులు చట్టవిరుద్దమని, చెల్లుబాటు కావని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

ఈ క్రమంలోనే కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. కేరళ కలమండలం డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ బాధ్యతల నుంచి ఆరిఫ్ ఖాన్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.