ఏషియానెట్ న్యూస్ ఛానెల్ కార్యాలయాలకు అవసరమైన రక్షణ కల్పించాలని కేరళ హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది.

కొచ్చి: ప్రముఖ న్యూస్ ఛానెల్ ఏషియానెట్ కార్యాలయాలకు అవసరమైన రక్షణ కల్పించాలని కేరళ హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. ఏషియానెట్ న్యూస్ అభ్యర్థన మేరకు తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్, కన్నూర్‌లోని సంస్థ కార్యాలయాలకు భద్రత కల్పించాలని రాష్ట్ర పోలీస్ చీఫ్‌ను హైకోర్టు జస్టిస్ ఎన్ నగరేష్ ఆదేశించారు. వివరాలు.. కొచ్చిలోని ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై శుక్రవారం (మార్చి 3) రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడి సిబ్బందిపై దూషణలకు దిగారు. అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులను కూడా బెదిరించారు.

ఈ క్రమంలోనే వామపక్ష అనుకూల విద్యార్థి సంస్థ ఎస్ఎఫ్ఐ, సీపీఐ(ఎం) యువజన విభాగం డీవైఎఫ్ఐల నుంచి ‘‘మరింత హింస, బెదిరింపులు’’ జరిగే అవకాశం ఉందని.. వాటి నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ఏషియానెట్ న్యూస్ హైకోర్టును ఆశ్రయించింది. మార్చి 3న దాదాపు 30 మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు కొచ్చి కార్యాలయంలోకి చొరబడి అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారని, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారని పిటిషన్‌లో పేర్కొంది. దుండగులు అక్కడ పనికి అంతరాయం కలిగించారని తెలిపింది. వారు సిబ్బందిని దాదాపు గంటపాటు ‘‘తప్పుగా నిర్బంధించారు’’ అని కూడా తెలిపింది. 

‘‘డీవైఎఫ్‌ఐ పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా ద్వారా.. మా న్యూస్ ఛానెల్‌కు వ్యతిరేకంగా కేరళ మొత్తం నిరసనను ప్రారంభిస్తామని ప్రకటించారు. మీడియా కార్యాలయంలోకి ప్రవేశించడం చట్టవిరుద్ధం, పత్రికా స్వేచ్ఛపై కఠోరమైన దాడి. స్వతంత్ర ప్రెస్ ద్వారా సమాచారాన్ని వెతకడం, వ్యాప్తి చేయడం ప్రాథమిక హక్కు.. దానిపై దాడి జరుగుతోంది’’ అని ఏషియానెట్ ఛానల్ తన పిటిషన్‌లో పేర్కొంది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్, కన్నూర్‌లలోని ఏషియానెట్ ఛానల్ కార్యాలయాలకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఘర్షణ లేదా హింసకు అవకాశం ఉన్నట్లయితే.. తగినంత సంఖ్యలో పోలీసులను మోహరించాలని కూడా ఆదేశాలు జారీచేసింది. 

ఇక, ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై ఎస్‌ఎఫ్‌ఐ దాడి ఘటనను ప్రెస్ క్ల‌బ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఎస్‌ఎఫ్‌ఐ దాడిని ఖండిస్తూ కేరళలోని కొచ్చి, త్రిసూర్, కన్నూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. ఈ ఘటన చోటుచేసుకున్న కొన్ని గంటలకే కోజికోడ్‌లోని ఏషియానెట్ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.