Asianet News TeluguAsianet News Telugu

కోజికోడ్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరు నిందితులు నిర్దోషులు.. కేరళ హైకోర్టు తీర్పు

కేరళలోని కోజికోడ్‌లో 2006లో జరిగిన జంట పేలుళ్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులోని ఇద్దరు నిందితులు డియంతవిద నజీర్, షాఫాస్‌లను నిర్దోషులుగా నిర్ధారించింది. వీరిద్దరిని ఎన్ఐఏ కోర్టు దోషులుగా ప్రకటించింది. కానీ, ఈ తీర్పును వెలువరిస్తూ వారు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా, వారిని హైకోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులున్నారు. ఇంకా ముగ్గురిపై విచారణ జరగాల్సి ఉండగా, అందులో ఇద్దరు ఇంకా పరారీలోనే ఉన్నారు.

kerala high court acquits two accused in kozhikode twin blast case
Author
Thiruvananthapuram, First Published Jan 27, 2022, 3:23 PM IST

తిరువనంతపురం: కేరళ(Kerala)లోని  కోజికోడ్‌(Kozhikode)లో చోటుచేసుకున్న జంట పేలుళ్ల కేసు(Twin Blast Case)లో హైకోర్టు(High Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులోని ఇద్దరు నిందితులను నిర్దోషులుగా(Acquits) ప్రకటించింది. ఎన్‌ఐఏ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వీరు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కేరళ హైకోర్టు.. దక్షిణ భారతంలో లష్కర్ ఏ తాయిబా కమాండర్‌గా ప్రచారం పొందిన తడియంతవిద నజీర్, షాఫాస్‌లను నిర్దోషులుగా నిర్ధారించింది. వీరిద్దరికి వ్యతిరేకంగా సరిపడా ఆధారాలు లేవని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. వీరి కంటే ముందు అబ్దుల్ హలీమ్, అబుబాకర్ యూసఫ్‌లనూ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికి వ్యతిరేకంగానూ ఎన్ఐఏ వాదించింది. 

కోజికోడ్ జంట పేలుళ్ల కేసులో నిందితులు కోర్టులో వాదిస్తూ.. తాము అమాయకులని పేర్కొన్నారు. తమపై ఉపా లాంటి అభియోగాలు మోపడం సరికాదని వాదించారు. కోర్టు కూడా వీరి వాదనలతో ఏకీభవించింది. ఈ జంట పేలుళ్ల కేసులో తొమ్మిది మంది నిందితులు ఇన్నారు. ఇంకా మరో ముగ్గురి ప్రమేయంపై విచారణ జరగాల్సి ఉన్నది. అందులో ఇద్దరు ఇంకా పరారీలోనే ఉన్నారు.

నజీర్, మరికొందరు నిందితులు కలిసి కోజికోడ్ కేఎస్ఆర్‌టీసీ, మొఫుసిల్ బస్ స్టాండ్‌లలో పేలుళ్లకు కుట్ర పన్నారని ఎన్ఐఏ చార్జిషీటు ఆరోపించింది. 2006 మార్చి 3 తేదీన వీరు ఈ కుట్ర పన్ని పేలుళ్లకు పాల్పడ్డారని తెలిపింది. ఓ మతోన్మాద ఘటనకు సంబంధించిన కేసులో ఓ ముస్లిం నిందితుడికి బెయిల్ రానందునే ప్రతీకారంగా ఈ పేలుళ్లకు పాల్పడినట్టు ఎన్ఐఏ వాదించింది. పది నిమిషాల తేడాతో ఈ పేలుళ్లు రెండు బస్ స్టేషన్‌లలో సంభవించాయి. టైమర్ డివైజులు బాంబు పేలుళ్లకు వినియోగించినట్టు తేలింది. తొలుత ఈ కేసును పోలీసుల ప్రత్యేక బృందం దర్యాప్తు చేసింది. ఆ తర్వాత దీన్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించగా, చివరకు ఎన్ఐఏ ఈ కేసును తన చేతుల్లోకి 2009లో తీసుకుంది. 2009లోనే ఇండియా, బంగ్లాదేశ్ సరిహద్దులో ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో నజీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసును 2021 మార్చిలో విచారిస్తున్నప్పుడు ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమర్థంగా వాదించడం లేదని ఎర్నాకుళం జిల్లా కలెక్టర్‌ ప్రమేయం చేసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. నిందితుడు నజీర్‌కు వ్యతిరేకంగా గత తొమ్మిది సార్లు జరిగిన విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగా వాదించలేదని పేర్కొన్నారు. అందుకే ఈ కేసులో సమర్థమైన వాదనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కొన్ని సూచనలు ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించారు.

ఈ కేసులో వాదించడానికి వచ్చిన కొందరు ప్రాసిక్యూటర్లు నిందితులపై అభియోగాలు ఫ్రేమ్ చేయడానికి చేసిన కీలక విచారణలోనూ వాదించడానికి సంసిద్ధతను కలిగి లేరని కోర్టు పేర్కొంది. ఎన్ఐఏ కోర్టుకు ప్రాసిక్యూటర్లు ప్రత్యేకంగా లేరు. కాబట్టి, కొంత మంది అధికారుల సమూహం నుంచి వారిని ఎంచుకుంటారు. కరోనా మహమ్మారి రావడంతో ఈ కేసు విచారణలో ప్రాసిక్యూటర్లు ఆన్‌లైన్‌లో వాదనలు వినిపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios