తిరువనంతపురం: కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలపై నమోదైన లైంగిక దాడి కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని కేరళ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఈ మేరకు కేరళ హోం మంత్రిత్వశాఖ శనివారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది.  2016, 2018, 2019 లలో నమోదైన అయిదు కేసులను సీబీఐకి అప్పగిస్తున్నట్టుగా కేరళ సర్కార్ ప్రకటించింది.

సోలార్ ప్యానెల్ స్కామ్ లో ప్రధాన నిందితురాలు సరితా నాయర్ కాంగ్రెస్ నేతలపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది.  ఉమెన్ చాందీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, హిబి ఎడేన్ , ఆదూర్ ప్రకాష్, మాజీ మంత్రి ఏపీ అనిల్ కుమార్, ఏపీ అబ్దుల్ కుట్టి తనను లైంగికంగా వేధించారని ఆమె  ఆరోపించారు.

సోలార్ స్కాంపై 2017లో దర్యాప్తు చేసిన జ్యూడీషీయల్ కమిషన్  లైంగిక వేధింపులపై కేసు నమోదు చేయాలని సిఫారసు చేసింది.  వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఎం సర్కార్ ఆదేశించింది. రాజకీయ దురుద్దేశ్యంతోనే కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొందని కాంగ్రెస్ విమర్శించింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎల్డీఎఫ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొందని కాంగ్రెస్ ఆరోపించింది.