కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం రాత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను సోమవారం ఉదయం 11.30 లోపు రాజీనామా చేయాలని కోరారు.

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం రాత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను సోమవారం ఉదయం 11.30 లోపు రాజీనామా చేయాలని కోరారు. యూజీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీ నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా ఈ తొమ్మిది మంది వీసీలు రాజీనామా చేయకుంటే షోకాజ్ నోటీసులు అందజేసి తొలగిస్తామని రాజ్‌భవన్‌ హెచ్చరించింది. ఒకవేళ వీసీలను తొలగిస్తే.. వారి స్థానంలో సీనియర్‌ ప్రొఫెసర్‌లకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

అయితే ఈ ఆదేశాలు.. విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్‌కు, రాష్ట్రంలో అధికార ఎల్‌డీఎఫ్ కూటమికి మధ్య విభేదాలను పెంచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లోకి ‘సంఘ్ ఎజెండా’ను నెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఎల్‌డీఎఫ్ కూటమి ఆరోపించింది. నవంబర్ 15న రాజ్‌భవన్ వెలుపల భారీ నిరసనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర చట్టాలకు అనుగుణంగా వర్సిటీల వైఎస్ ఛాన్సలర్‌లను నియమించినందున గవర్నర్ ఉత్తర్వులు ‘‘ప్రజాస్వామ్యం అన్ని పరిమితులను ఉల్లంఘించాయి’’ అని సీపీఎం ఆరోపించింది. వీసీలు తక్షణమే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. న్యాయపరమైన అవకాశాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు తెలిపారు. ఇక, గవర్నర్‌కు సమాధానం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉదయం 10.30 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

అయితే ఇప్పటివరకు వైస్ ఛాన్సలర్లు ఎవరూ కూడా రాజీనామా చేయలేదు. వారు గవర్నర్‌పై చట్టపరంగా పోరాడాలని నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే.. సొంతంగా కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి చర్చించేందుకు న్యాయ నిపుణులతో సమావేశం కావాలని భావిస్తున్నారు. 

ఇక, గవర్నర్ నోటీసులు జారీ చేసిన జాబితాలో.. ఎంఎస్ రాజశ్రీ (ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ), వీపీ మహదేవన్ పిళ్లై (కేరళ యూనివర్సిటీ), సాబు థామస్ (మహాత్మా గాంధీ యూనివర్సిటీ), కేఎన్ మధుసూదనన్ (కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), కే రిజీ జాన్ (కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్), గోపీనాథ్ రవీంద్రన్ (కన్నూరు విశ్వవిద్యాలయం), ఎంవీ నారాయణన్ (శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం), ఎంకే జయరాజ్ (కాలికట్ విశ్వవిద్యాలయం), వీ అనిల్ కుమార్ (తుంచత్ ఎజుతచన్ మలయాళ విశ్వవిద్యాలయం) ఉన్నారు.