తిరువనంతపురం: కేరళలోని తిరువునంతపురానికి 30 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిన కేసులో కీలక నిందితులు ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బెంగుళూరులో అరెస్టు చేసింది. కీలక నిందితులు స్వప్న సురేష్, సందీప్ నాయర్ కనిపించకుండా పోయారు. వారిని ఎన్ఐఎ శుక్రవారం అరెస్టు చేసింది. 

మరో నిందితుడు సరిత్ ను కస్టమ్స్ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎన్ఐఎ శుక్రవారం కేసు నమోదు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నందు వల్ల, భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఆ డబ్బులను వాడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడం వల్ల కేసును తాము విచారించాలని నిర్ణయించుకున్నట్లు ఎన్ఐఎ అధికారులు చెప్పారు. 

భారీ యెత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన కేసులో సరిత్, స్వప్న ప్రభ సురేష్, ఫాజిల్ ఫరీద్, సందీప్ నాయర్ లను నిందితులుగా చేర్చారు. నిందితులకు రాష్ట్ర పోలీసులు సహకరించారని కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల విమర్శించారు. 

తిరువనంతపురంలో లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో స్వప్న సురేష్ బెంగుళూరుకు పారిపోవడాన్ని బట్టే పోలీసుల సహకారం ఉందని అర్థమవుతోందని ఆయన అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ కూడా అటువంటి ఆరోపణే చేశారడు.

దాదాపు 15 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని కొచ్చి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒక్కడైన సురేష్ యుఎఈ కాన్సులేట్ లో గతంలో ఉద్యోగం చేశాడు. కేరళ సమాచార సాంకేతిక శాఖతో సంబంధం ఉన్న కంపెనీలో అతను మార్కెటింగ్ అధికారిగా కూడా పనిచేశాడు. 

నిందితులకు ముఖ్యమంత్రి కార్యాలయంతో సంబంధాలున్నాయని, అందువల్ల నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ ఆరోపణను ముఖ్యమంత్రి ఖండించారు. ఈ విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ అధికారికి ఉద్వాసన పలికారు. ఐటీ కార్యదర్శిని బదిలీ చేశారు. 

కేసులో నిందితుడైన సందీప్ నాయర్ భార్య స్మగ్లింగ్ కు సంబంధించి కీలకమైన విషయాలు వెల్లడించారు. సరిత్, స్వప్న సహకారంతో తన భర్త బంగారాన్ని అక్రమంగా తరలించాడని ఆమె చెప్పారు. ఇతర ముఠాలు చేసినట్లే వారు చేశారని ఆమె చెప్పారు. ఎయిర్ కార్గో కాంప్లెక్స్ నుంచి కాన్సులేట్ కార్గో పత్రాలను స్వప్న ద్వారా పొందేవారని అన్నారు.