తిరువనంతపురం:గోల్డ్ స్మగ్లింగ్ లో కేరళ సీఎం విజయన్ పాత్ర ఉందని విచారణలో స్వప్న సురేష్ చెప్పారు. సీఎం విజయన్ తో పాటు స్పీకర్, ముగ్గురు మంత్రులకు కూడా సంబంధం ఉందని ఆమె విచారణలో తెలిపారు.

వచ్చేనెల 6వ తేదీన కేరళ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ తరుణంలో కేరళ గోల్డ్ స్కామ్ మరోసారి తెరమీదికి వచ్చింది.బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న స్వప్న సురేష్ కస్టమ్స్ విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం విజయన్ ప్రమేయం ఉందని ఆమె చెప్పారు. 

కేరళ అసెంబ్లీ స్పీకర్ శ్రీరామకృష్ణన్ సహా మరో ముగ్గురు మంత్రులకు కూడ ఈ కేసుతో సంబంధం ఉందని ఆమె విచారణలో చెప్పారు. ఈ విషయమై కస్టమ్స్ శాఖ కేరళ హైకోర్టుకు సమాచారం అందించింది.ముఖ్యమంత్రి, కాన్సులేట్ జనరల్ మధ్య జరిగిన చర్చల్లో స్వప్న సురేష్ మధ్యవర్తిగా ఉన్నారు. సీఎం కు అరబిక్ అర్ధం కాదు,, మాట్లాడడం రాదు. దీంతో స్వప్న సురేష్ మధ్యవర్తిగా వ్యవహరించారు.

ఈ ఒప్పందంలో సీఎంతో పాటు మంత్రులకు కోట్లాది రూపాయాలు కమిషన్ అందిందని ఆమె విచారణలో తెలిపారు. ఈ మేరకు కస్టమ్స్ డిపార్ట్ మెంట్ తన అఫిడవిట్ లో పేర్కొంది.బంగారం అక్రమ రవాణ , డాలర్ స్మగ్లింగ్ కేసులో తాము చేసిన ఆరోపణలన్నీ నిజమయ్యాయని కేరళ అసెంబ్లీలో విపక్ష నేత రమేష్ చెన్నితాలా విమర్శించారు.