అమ్మ పెట్టాపెట్టదు.. అడుక్కోని తిననివ్వదు అన్నట్లుంది కేంద్ర ప్రభుత్వం వ్యవహారం. భారీ వర్షాలు, వరదలతో కేరళ అతలాకుతలమైంది. తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకోవడానికి కేవలం రూ.500కోట్లు మాత్రమే కేంద్రం ప్రకటించింది. అయితే.. ప్రస్తుతం కేరళ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్న యూఏఈ.. రూ.700కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే.. దీనిని అడ్డుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.

మలయాళ సీమను ఆదుకునేందుకు యూఏఈ ప్రకటించిన రూ. 700 కోట్ల భారీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం నిరాకరించబోతోంది. 2004లో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విపత్తు సహాయ విధానం ప్రకారం యూఏఈ ప్రభుత్వ సాయాన్ని అంగీకరించే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

భారత విపత్తు సహాయ విధానంలో 2004 సంవత్సరం కీలక మలుపుగా చెప్పవచ్చు. ఈ విధానం అమల్లోకి వచ్చిననాటి నుంచి మన దేశం విదేశీ సహాయాలను అంగీకరించడం లేదు. అంతకుముందు 1991 ఉత్తరకాశీ భూకంపం, 1993 లాతూర్‌ భూకంపం, 2001 గుజరాత్‌ భూకంపం, 2002 బెంగాల్‌ తుఫాన్‌, 2004 జూలై బిహార్‌ వరదల సమయంలో భారతదేశం విదేశీ సహాయాన్ని స్వీకరించింది. 

అయితే, ‘దేశంలో తలెత్తే పరిస్థితుల్ని సొంతంగా ఎదుర్కొగలిగే సత్తాను భారత్‌ సాధించింది. అవసరమైతే విదేశీ సహాయాన్ని తీసుకుంటాం’ అని పేర్కొంటూ 2004లో నూతన విపత్తు సహాయ విధానాన్ని మన్మోహన్‌సింగ్‌ అమల్లోకి తెచ్చారు. కేరళకు యూఏఈ ప్రకటించిన సహాయం విషయంలోనూ ఈ విధానాన్ని వర్తిస్తుందని, కాబట్టి ఈ సాయాన్ని అంగీకరించే అవకాశం లేదని కేంద్రానికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ‘ప్రస్తుతం కేంద్రం విదేశాల నుంచి  ఆర్థిక సాయాన్ని అంగీకరించట్లేదు. యూఏఈ సాయానికీ అదే వర్తిస్తుంది’ అని ఆయన అన్నారు. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

విదేశాల్లోని భారతీయులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపవచ్చని.. వాటిపై ఎలాంటి పన్ను ఉండదని విదేశాంగశాఖ వివరణిచ్చింది. ‘విదేశీ సాయం నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) కింద గుర్తింపు పొందిన లాభాపేక్ష లేని సంస్థలు, ఎన్జీవోలకు విదేశీ సాయం అందితే వాటిపై పన్ను ఉండదు. గుర్తింపు లేని ఎన్జీవోలకు నిధులు అందితే మాత్రం వాటిపై పన్ను చెల్లించాలి’ అని విదేశాంగ శాఖ అధికారి తెలిపారు.