Asianet News TeluguAsianet News Telugu

కకావికలమైన కేరళ...పలు రాష్టాల ఆపన్నహస్తం

 ప్రకృతి అందాలకు నెలవైన కేరళపై ప్రకృతి కన్నెరజేసింది. ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు వరదలతో రాష్ట్రం జలవిలయంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. గత వందేళ్లలో కనీవినీ ఎరుగనంతగా వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. 

Kerala floods Fresh red alert issued for 11 districts
Author
Kochi, First Published Aug 18, 2018, 5:33 PM IST

కొచ్చి: ప్రకృతి అందాలకు నెలవైన కేరళపై ప్రకృతి కన్నెరజేసింది. ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు వరదలతో రాష్ట్రం జలవిలయంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. గత వందేళ్లలో కనీవినీ ఎరుగనంతగా వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఈ విపత్తుతో కేరళ పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకుపోయి ఆహారం, నీరు లేక సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ఈ వరదల ప్రభావానికి 324 మంది ప్రాణాలు కోల్పోగా  3లక్షల 14వేల మంది పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. రవాణా వ్యవస్థలన్నీనాశనమైపోయాయి.  త్రివిధ దళాలు ప్రజలను కాపాడేందుకు ముమ్మర సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. .

అయితే పదిరోజులుగా వరుణుడు కేరళపై కన్నెర్రజేస్తున్నాడు. పగబట్టినట్లు కుండపోతగా కురుస్తున్నాడు. దీంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. రాష్ట్రంలోని 14 జిల్లాలకు గాను 11 జిల్లాల్లో వాతావరణ శాఖ మళ్లీ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీనికితోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో మరికొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కేరళ వాసులు ఆందోళన చెందుతున్నారు.  

ఆర్మీ, నావికా దళం, వైమానిక దళాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు, స్థానిక యువకులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కేరళలో 58 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. సహాయక సామాగ్రిని అన్ని జిల్లాలకు తరలిస్తున్నారన్నారు. ఎన్డీఆర్ఎఫ్‌ 7వేల మందిని కాపాడిందని, అత్యవసర సహాయం కావాల్సి ఉన్న 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిందని స్పష్టం చేశారు. 

 ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డుల కోసం శనివారం అదనంగా 75 మోటరైజ్డ్‌ పడవలను, సాధారణ పడవలను, మరో 8 హెలికాప్టర్లను పంపించారు. ఆహార ప్యాకెట్లు కూడా సరఫరా చేశారు. కొచ్చిలో మూడు వేల మంది కోసం కమ్యూనిటీ కిచెన్‌ను నడిపిస్తున్నారు. నావికా దళానికి చెందిన 42 బృందాలు, కోస్ట్‌గార్డు 28 బృందాలను పంపించింది. వీరు మోటారు పడవలతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వాయుసేన 23 హెలికాప్టర్లు, 11 సరకు రవాణా విమానాలతో సేవలు అందిస్తోంది

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటించి వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌, కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్‌, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వరదల భీభత్సం వల్ల రాష్ట్రానికి 25వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. 2వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా...మోదీ 500కోట్ల రూపాయలు తక్షణ సాయంగా ప్రకటించారు. అంతకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 100కోట్లు కేటాయించారు. మెుత్తం కేంద్రప్రభుత్వం 600కోట్లు సాయం ప్రకటించింది. అటు కేరళలో సహాయక చర్యలు అందిస్తున్న సిబ్బందిని మోదీ ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలు వరదలకు ఎదురీది పోరాడుతున్నారని అభిప్రాయపడ్డారు. 

కేరళ వరదలను తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌  గాంధీ కోరారు. దయచేసి కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. ఎంతో మంది ప్రజల జీవితాలు, జీవనాధారాలు, లక్షల మంది భవిష్యత్తు ప్రమాదంలో ఉంది అని రాహుల్‌ ప్రధాని మోదీకి ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక రోజు జీతాన్ని కేరళకు సాయంగా ఇవ్వనున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. 

సర్వం కోల్పోయిన కేరళకు పలు రాష్ట్రాలు, ప్రముఖులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. కేరళ వరద బాధితుల కోసం ఆహారం, మంచి నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక రైలు మహారాష్ట్రలోని పుణె నుంచి బయలుదేరుతోంది. కేరళలోని చిన్నారుల కోసం.. వంద టన్నుల ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వంద మెట్రిక్‌ టన్నుల బాలామృతాన్ని కేరళకు పంపించింది. 

 బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కేరళకు 10కోట్ల రూపాయల సహాయం ప్రకటించారు. హర్యాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ 10కోట్ల రూపాయలు, తెలంగాణ సర్కారు 25కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10కోట్లు విరాళం ప్రకటించాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ 10కోట్ల రూపాయలు సాయం ప్రకటించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక నెల జీతాన్ని కేరళ సహాయ నిధికి ఇవ్వనున్నట్లు పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కేరళ బాధితుల కోసం కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా  2కోట్ల రూపాయలు సాయం ప్రకటించింది. 

వీరితోపాటు గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ 20కోట్లు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 20 కోట్లు, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ 5కోట్లు సాయంగా ప్రకటించారు. సహాయక చర్యల్లో భాగంగా  245మంది అగ్నిమాపక సిబ్బందిని పంపిస్తున్నట్లు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. వారంతా వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టడానికి శిక్షణ పొందిన వారని, అనుభవం ఉన్నవారని చెప్పారు. ఈ బృందం 75 బోట్లను కూడా తీసుకెళ్తోందన్నారు. 

 .

Follow Us:
Download App:
  • android
  • ios