కేరళలోని చేపల వ్యాపారికి రూ. 70 లక్షల లాటరీ తగిలింది. సుమారు రూ. 9 లక్షల అప్పులతో పీకల్లోతు మునిగిన ఆ జాలరికి ఇంటిని అటాచ్ చేసుకుంటామని బ్యాంకు నోటీసులు అందిన గంటల వ్యవధిలోనే ఈ లాటరీ గెలిచినట్టు వార్త అందడం వారి ముఖాల్లో రెట్టింపు సంతోషాన్ని నింపింది.
తిరువనంతపురం: కేరళలో ఓ చేపల వ్యాపారికి పంట పండింది. అప్పుల్లో మునిగి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో లాటరీ ఒక వరంలా తగిలింది. అప్పుడు బ్యాంకు నుంచి లోన్‌కు సంబంధించిన నోటీసులు వచ్చాయి. ఇల్లును అటాచ్ చేయడానికి సంబంధించిన నోటీసు అది. ఆ నోటీసు చూసి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇల్లు అమ్మేసేలాయా? వద్దా? అనే ఆలోచనల సుడిగుండంలో ఉన్నప్పుడు కొన్ని గంటల వ్యవధి తర్వాత వీటన్నింటిని మరిచిపోయి ఎంతో ఉపశమనం ఇచ్చే వార్త ఆయన చెవిన చేరింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అక్షయ లాటరీలో తాను విన్నర్ అని, రూ. 70 లక్షలు గెలుచుకున్నట్టు తెలిసింది.
ఈ నెల 12వ తేదీన పీకుంజి అనే వ్యక్తి లాటరీ టికెట్ కొన్నాడు. ఆయన అప్పుల్లో కూరుకుపోయి ఏదైనా ఊతం దొరికితే చాలు సమస్యల కడలి నుంచి బయటపడాలని ఆరాటపడుతున్నాడు. కానీ, లోన్ కోసం ఇంటిని అటాచ్ చేసుకుంటామని బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో ఆయన దాదాపు నైరాశ్యంలోకి వెళ్లాడు. ఆయనకు సుమారు రూ. 9 లక్షల అప్పు ఉన్నది.
చేపల వేటకు వెళ్లి ఈ రోజు మధ్యాహ్నం ఇంటికి తిరిగివచ్చినప్పుడు బ్యాంకు నోటీసులు వచ్చినట్టు తెలిసింది. కానీ, ఈ నోటీసులు అందిన గంటల వ్యవధిలోనే ఆయన లాటరీ గెలుచుకున్నట్టు శుభవార్త అందింది.
ఈ లాటరీ అందిన తర్వాత పీకుంజి భార్య మాట్లాడారు. లాటరీ డబ్బులు అందగానే ముందుగా తమకు ఉన్న అప్పులన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. మిగిలిన డబ్బులతో తమ పిల్లలకు మంచి విద్య అందిస్తామని, తద్వార వారు జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారని పేర్కొన్నారు.
