వరకట్న వేధింపులు తట్టుకోలేక విస్మయ చనిపోవడంతో.. ఈకేసులో కిరణ్ కుమార్ ని పోలీసులు ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేశారు. 

కేరళలో ఇటీవల ఓ యువతి వరకట్న వేధింపులకు బలైన సంగతి తెలిసిందే. పెళ్లైన కొద్ది నెలలకే విస్మయ అనే యువతి.. అత్తారింట్లో ఉరివేసుకొని ప్రాణాలు కోల్పోయింది. అయితే.. ఆమె చనిపోవడానికి అత్తింటి వేధింపులే కారణమంటూ విస్మయ తండ్రి ఆరోపించాడు.

కాగా.. తాజాగా విస్మయ భర్త, ఈ కేసులో ప్రధాన నిందితుడు కిరణ్ కుమార్ ని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

విస్మయ భర్త కిరణ్ కుమార్... మోటార్ వెహికిల్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. వరకట్న వేధింపులు తట్టుకోలేక విస్మయ చనిపోవడంతో.. ఈకేసులో కిరణ్ కుమార్ ని పోలీసులు ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో.. ఆయనను కొంతకాలం విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా.. తాజాగా అతనిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించడం గమనార్హం.

కిరణ్‌పై ఆరోపణలు రుజువయ్యాయని రవాణా మంత్రి ఆంటోని రాజు విలేకరుల సమావేశంలో చెప్పారు. డిపార్ట్‌మెంట్ హెడ్ విచారణ, స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు రవాణా శాఖ తెలిపింది. ఈ చర్య కేరళ సివిల్ సర్వీస్ రూల్ -1960 రూల్ 11 (8) ప్రకారం తీసుకున్నట్టుగా పేర్కొంది. వరకట్నం వేధింపుల కారణంగా కేరళ చరిత్రలో ఓ వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడు. విస్మయ మరణం తర్వాత కిరణ్ కుమార్‌ను సర్వీస్ నుండి సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయం విస్మయ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. వారు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రి ఆంటోని రాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు.