విస్మయను ఆత్మహత్య చేసుకునేలా చేసింది భర్తే.. తీర్పు వెలువరించిన కేరళ కోర్టు. ఈ రోజు ఈ కేసులో విస్మయ భర్త కిరణ్ కు శిక్ష ఖరారు చేయనుంది.
కేరళ : kerala తిరువనంతపురంలో గతేడాది సంచలనం సృష్టించిన
Medical student విస్మయ Suicide కేసులో సోమవారం తీర్పు వెలువడింది. ఆమె భర్త కిరణ్ కుమార్ ను కేరళ కోర్టు దోషిగా తేల్చింది. కట్నం కోసం వేధించి 22 ఏళ్ల విస్మయను భర్తే బలవన్మరణానికి పాల్పడేలా చేశాడని న్యాయస్థానం నిర్ధారించింది. మంగళవారం శిక్ష ఖరారు చేయనుంది. ప్రస్తుతం బెయిల్పై ఉన్న కిరణ్ ను తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని jailకు తరలించారు.
ఈ కేసులో దోషికి సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలా చూస్తామని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్ రాజ్ పేర్కొన్నారు. ఇది ఒక వ్యక్తికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదని… సామాజిక దురాచారానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో విస్మయకు న్యాయం జరిగిందని ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కిరణ్ కు శిక్షతో తమ కుమార్తె తిరిగి రాకపోయినా భవిష్యత్తులో ఎవరు ఇలా బలికాకుండా ఉండేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దోషికి సాధ్యమైనంత శిక్ష పడాలని కోరారు.
అసలు ఏం జరిగిందంటే..
ఆయుర్వేద వైద్య విద్యార్థి అయిన విస్మయ చదువు పూర్తికాకముందే 2019 మే 19న తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయిన కిరణ్ కుమార్ కు ఇచ్చి వివాహం జరిపించారు. కట్నంగా 100 కవర్ల బంగారం, ఎకరం భూమి, రూ. 10 లక్షల కారు కూడా ఇచ్చారు. అయితే, కారు నచ్చలేదని తనకు 10 లక్షలు నగదు ఇవ్వాలని కిరణ్ డిమాండ్ చేశాడు. ఇదే విషయమై విస్మయను చిత్రహింసలకు గురి చేసేవాడు.ఈ నేపథ్యంలోనే 2021 జూన్ 20న విస్మయ తన బంధువులకు ఒక whatsapp మెసేజ్ చేసింది.
కట్నం కోసం కిరణ్ తనను వేధిస్తున్నాడని వాపోతూ… అతను కొట్టడంతో శరీరంపై అయిన గాయాలను ఫోటోలు తీసి అందరికీ పంపింది. ఆ మరుసటి రోజే కొల్లాం జిల్లా సస్థం కొట్టాలోని కిరణ్ ఇంట్లో శవమై కనిపించింది. కాగా విస్మయ మృతికి కిరణ్ కారణమని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు సంచలనంగా మారడంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడినట్టు 500 పేజీలకు పైగా అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ చార్జిషీట్లో పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈనెల 17న తీర్పును రిజర్వులో ఉంచింది. సోమవారం కిరణ్ ను దోషిగా తేల్చింది.
కాగా, కోర్టు తీర్పుకు కొన్ని గంటల ముందు విస్మయపై జరిగిన దాడి గురించి తెలిపే ఓ ఆడియో క్లిప్ వెలుగు చూసింది. ఆ ఆడియో క్లిప్... విస్మయకు, ఆమె తండ్రి త్రివిక్రమన్ నాయర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఉంది. అందులో విస్మయ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తాను ఎదుర్కొన్న హింస గురించి తన తండ్రి వద్ద ఎదుర్కొన్న ప్రస్తావించింది. తన భర్త కిరణ్ దాడి చేస్తున్నాడని.. భయంగా ఉందని విస్మయ చెబుతోంది. కిరణ్ తనను దారుణంగా కొడుతున్నాడని, అవమానిస్తున్నాడని, ఏడుస్తూ తన తండ్రికి చెప్పింది. ఇక కిరణ్‌తో కలిసి బతకలేనని, ఈ వేధింపులు భరించలేనని తెలిపారు. తనను కిరణ్ ఇంట్లో నుంచి తీసుకెళ్లాలని తండ్రిని కోరింది. చాలా భయంగా ఉందని తెలిపింది.