150 Years Imprisonment: మైనర్ కుమార్తెపై పలుమార్లు అత్యాచారం.. కీచక తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష..
150 Years Imprisonment:మైనర్ కుమార్తెపై పదే పదే అత్యాచారం చేసిన 42 ఏళ్ల వ్యక్తిని దోషిగా నిర్ధారించిన కేరళ కోర్టు అతనికి 150 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేరళ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు పోక్సో, ఐపీసీ, జువైనల్ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద మొత్తం 150 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
150 Years Imprisonment: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రే కామాంధుడిలా మారాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిపై పలు మార్లు లైంగిక దాడి చేశాడు.ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించేవాడు. తండ్రి వేధింపులు భరించలేక జరిగిన విషయం తల్లికి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన కేరళ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు.. 42 ఏళ్ల కీచక తండ్రికి ఏకంగా 150 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో, ఐపీసీ, జువైనల్ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద ఈ కఠిన శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే.. శిక్షలు ఏకకాలంలో అనుభవించాల్సి ఉండటం, ఆ వ్యక్తికి గరిష్టంగా 40 సంవత్సరాల జైలు శిక్ష విధించడం వలన, అతను 40 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఆర్డర్‌లో పేర్కొంది.
IPC సెక్షన్ 376(3) ప్రకారం పదహారేళ్లలోపు బాలికపై అత్యాచారం పాల్పడిన నేరానికి 30 ఏళ్లు, 16 ఏళ్లలోపు బాలికపై లైంగిక దాడి చేసినందుకు గానూ POCSO చట్టంలోని సెక్షన్ 4(2) ప్రకారం 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.అదనంగా.. పిల్లలపై ఒకటి కంటే ఎక్కువసార్లు లేదా పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పోక్సో చట్టంలోని సెక్షన్‌లు 5(l) ప్రకారం, అలాగే.. సొంత కుటుంబసభ్యుడే అత్యాచారానికి పాల్పడిన నేరానికి 5(n) ప్రకారం నిందితుడికి 40+40 ఏళ్ల చొప్పున శిక్ష విధించింది. అంతేకాకుండా.. IPCలోని సెక్షన్ 450 కింద నేరం చేసిన వ్యక్తికి ఏడేళ్లు , జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 75 (పిల్లలపై క్రూరత్వానికి శిక్ష) కింద నేరానికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది.
అదనంగా.. నాలుగు లక్షల జరిమానా కూడా విధించిన కోర్టు అందులో రెండు లక్షల రూపాయలను బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. బాధితురాలికి నష్టపరిహారం పథకం కింద ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాల్సిందిగా మంజేరి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి సిఫారసు చేసింది. ఈ సంఘటన 2022లో జరిగిందని కలికావు పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. మైనర్ బాధితురాలు దోషి ముగ్గురు భార్యలలో ఒకరి కుమార్తె అని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.