Norovirus: కేరళలో మ‌రో నోరోవైరస్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది.  రాష్ట్రంలో తాజాగా రెండు నోరోవైరస్ (Norovirus) కేసులు నమోదైనట్టు ప్రభుత్వం నిర్ధారించింది. రాజధాని తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్టు తెలిపింది.  

Norovirus: ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌త రెండున్నరేండ్లుగా కరోనా వేరియంట్లు బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌డిప్పుడే సాధార‌ణ ప‌రిస్థితులోకి అడుగుపెడుతున్నామ‌ని భావిస్తున్న తరుణంలో మంకీపాక్స్ రూపంలో మరో ఉపద్రవం వ‌చ్చిప‌డింది. ఇదిలా ఉంటే.. తాజాగా కేరళలో నోరోవైర‌స్ (Norovirus) వెలుగులోకి వచ్చింది. తాజాగా రాష్ట్రంలోని రెండు నోరోవైరస్ (Norovirus) కేసులు నమోదైనట్టు ప్రభుత్వం నిర్ధారించింది. రాజధాని తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు పిల్లలలో నోరోవైరస్ గుర్తించినట్టు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ధృవీకరించారు. ఆరోగ్య శాఖ అవసరమైన నివారణ చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. 

వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ బారినపడిన చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందనీ. ఆందోళన అవసరం లేదని ఆరోగ్య శాఖ తెలిపింది. కలుషిత ఆహారం, అతిసార ఫిర్యాదుల నేపథ్యంలో వళింజమ్‌లోని ఎల్‌ఎంఎస్ఎల్‌పీ పాఠశాల విద్యార్థుల నుంచి నమూనాలు సేకరించి, పరీక్షల కోసం పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపింది.

పాఠశాలల్లో పంపిణీ చేసిన మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ సంభవించినట్లు ప్రాథమికంగా వెల్ల‌డైంద‌ని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రకటించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ, సాధారణ విద్య, పౌరసరఫరాల శాఖ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాయి. మధ్యాహ్న భోజనం తయారు చేయడం, నీటి ట్యాంకులు శుభ్రం చేయడం, సిబ్బందికి అవగాహన కల్పించడం వంటి వాటిల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాల‌ని తెలిపారు.

కేరళలో తొలిసారి గతేడాది నవంబరులో నోరోవైరస్ తొలి కేసు నమోదైంది. వయనాడులోని వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులు నోరోవైరస్ బారినపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంతో అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కేసులు నమోదు కాలేదు.

నోరోవైరస్ ల‌క్షణాలు

నోరోవైరస్ అనేది అంటు వ్యాధి. ఈ వైర‌స్ సాధారణంగా కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం సోకిన వ్యక్తితో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్య‌క్తుల్లో ఒక‌టి, రెండు రోజుల తర్వాత వాంతులు, విరేచనాలు సంభ‌విస్తాయి. కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి, శరీర నొప్పి వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మ‌రో వ్య‌క్తికి సోకుతోంది. ఈ వైర‌స్ 60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా జీవించగలదు. అంటే.. ఈ వైరస్‌ను వేడినీరు లేదా క్లోరిన్ జోడించడం ద్వారా చంపలేము. హ్యాండ్ శానిటైజర్‌ను వాడినప్పటికీ ఈ వైరస్ మనుగడ సాగిస్తుంది.